Vande Bharat Sleeper: సామాన్యులకే వందేభారత్ స్లీపర్.. వీఐపీ కోటాకు నో ఛాన్స్!
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:24 PM
త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైల్లో సామాన్యులకు పెద్ద పీట వేసేలా పలు నిబంధనలను అమలు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: సామాన్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు మరి కొన్ని రోజుల్లో పట్టాలెక్కనుంది. కోల్‌కతా, గువాహటి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈ రైలు రాకతో తూర్పు భారతం, ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం మరింత మెరుగవుతుందని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ రైలు ప్రారంభం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది (Vande Bharat Sleeper Train Details).
సామాన్యుల కోసమే ఈ రైలును ప్రవేశపెట్టినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్లో ఎమర్జెన్సీ, వీఐపీ కోటాలు వంటివేవీ ఉండవట. అంతేకాకుండా, రైల్వే ఉన్నతాధికారుల పాస్‌లు కూడా ఈ రైల్లో చెల్లుబాటు కావు. కేవలం కన్‌ఫర్మ్‌డ్ టిక్కెట్లు ఉన్న వారికే ఇందులో ప్రయాణించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌ఏసీ టిక్కెట్స్‌కు కూడా ఈ రైల్లో అనుమతి ఉండదు. ప్యాసింజర్‌లకు అత్యద్భుత ప్రయాణ అనుభవం కల్పించేందుకు ఇలాంటి నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది.
ఈ రైల్లో ప్రయాణికులకు పలు సౌకర్యాలు కల్పించనున్నారు. ఆధునిక బెడ్స్, బ్లాంకెట్ కవర్స్ అందుబాటులో ఉంటాయి. సాధారణ రైళ్లల్లో కంటే ఇవి ఎంతో మెరుగ్గా ఉండనున్నాయి. ఏకీకృత నిబంధనలు, పారదర్శక టిక్కెటింగ్ విధానం అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్థానిక వంటకాలు ఈ రైల్లో అందుబాటులో ఉంటాయి. భారత సంస్కృతి ఉట్టిపడేలా రైలు లోపలి డిజైన్ ఉంటుందని కూడా అధికారులు చెప్పారు.
ఈ రైల్లో మొత్తం 823 బెర్తులు ఉన్నాయి. పదకొండు 3-టైర్ ఏసీ కోచ్‌లు , నాలుగు 2-టైర్ ఏసీ కోచ్‌లు, 1-ఏసీ కోచ్ ఒకటి ఉన్నాయి. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా బెర్తులను రూపొందించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు అనేకం చేశారు. రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థతో పాటు పరిశుభ్రత కోసం కోచ్‌లల్లో ప్రత్యేక డిస్‌ఇన్‌ఫెక్టెంట్ టెక్నాలజీని ఉపయోగించారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
ప్రశాంత్ కిషోర్ పార్టీకి భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే రాజీనామా
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్