ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోయిన భారీ వంతెన..
ABN , Publish Date - Aug 10 , 2026 | 08:54 PM
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. వరద ధాటికి ఇనుప వంతెన క్షణాల్లో కొట్టుకుపోగా.. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని ఇవాళ (సోమవారం) వరదనీరు ముంచెత్తింది. వరద ధాటికి ఓ వంతెన క్షణాల్లో కొట్టుకుపోగా.. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
భారీ వర్షాల కారణంగా నీతి వ్యాలీ ప్రాంతంలో ఉన్న నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. లోతట్టు ప్రాంతాల వైపు ఆ వరదనీరు దూసుకొచ్చింది. నీటితో పాటు మట్టి, బురద, పెద్దపెద్ద బండరాళ్లు కొట్టుకువచ్చాయి. ఈ క్రమంలో వరద ప్రవాహం బలంగా ఢీకొట్టడంతో ఓ ఇనుప వంతెన కొట్టుకుపోయింది. వంతెనకు ఓ వైపున ఉన్న పలు వాహనాలు కొట్టుకుపోగా.. మరోవైపు ఉన్న ఓ ట్రక్కు, ఎస్‌యూవీ వాహనాదారులు అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రకృతి వైపరిత్యాన్ని అక్కడే ఉన్న కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారాయి. కాగా, వంతెన కొట్టుకుపోవడంతో నీతి వ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో రహదారులు దెబ్బతినడం, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థుల భారీ నిరసనలు.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు..
విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు..