విద్యార్థుల భారీ నిరసనలు.. జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఖియాంగ్టే అరెస్టు..
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:29 PM
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టేను ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి విద్యార్థులు భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఖియాంగ్టేను అదుపులోకి తీసుకున్నారు.
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టేను ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి విద్యార్థులు భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఖియాంగ్టేను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జేపీఎస్‌సీ 14వ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ఆయనకు పలు కీలక ప్రశ్నలు సంధించారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీఎల్ (TDPL) కంపెనీని జేపీఎస్‌సీ 14వ పరీక్ష నిర్వహణకు ఎందుకు ఎంపిక చేశారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలపై ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇదే కేసులో జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌ను పలుమార్లు విచారించిన సీఐడీ అధికారులు.. తాజాగా ఆయనను అరెస్టు చేశారు. కాగా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేసిన ఖియాంగ్టే.. 2026 జులై 22న జేపీఎస్‌సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడటానికే తాను రాజీనామా చేసినట్లు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. మరోవైపు, జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షల ప్రక్రియలో అవకతవకలు, ఓఎంఆర్ షీట్ల లీకేజీలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు 17 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో జార్ఖండ్‌లో విద్యార్థులు, ఆయా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాంచీలోని అసెంబ్లీ వైపు వేలాది మంది విద్యార్థులు దూసుకెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించారు. అలాగే లాఠీఛార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మరోవైపు, రాంచీతో పాటు హజారీబాగ్, ధన్‌బాద్, బొకారో తదితర జిల్లాల్లోనూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉధృతం.. నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్..
విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు..