పాకిస్థాన్‌లో మళ్లీ చర్చలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:15 AM
అమెరికా- ఇరాన్ మధ్య ఒకటి రెండు రోజుల్లో రెండో దఫా చర్చలు త్వరలో జరిగే అవకాశం ఉంది.
పాక్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ
విట్‌కాఫ్, కుష్నర్‌ను పాకిస్థాన్‌కు పంపనున్న అమెరికా
వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికా- ఇరాన్ మధ్య ఒకటి రెండు రోజుల్లో రెండో దఫా చర్చలు త్వరలో జరిగే అవకాశం ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ , సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. అనంతరం ఆయన పాకిస్థాన్ వెళ్లారు. ఇరాన్ అధికారుల బృందం కూడా ఇస్లామాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వం కూడా ఇద్దరు ప్రతినిధులను పాక్‌కు పంపనుంది. పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ప్రత్యేక రాయబారి జారెడ్ కుష్నర్‌లను ఇరాన్‌తో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు పంపుతున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా ఇస్లామాబాద్ వెళ్తారని తెలిపాయి. అయితే, చర్చలపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చర్చలు జరిగే అవకాశం ఉండటంతో పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్-రావ ల్పిండి జంట నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ప్రజల కద లికలపై కూడా ఆంక్షలు విధించింది. దీంతో స్థానికులు తీవ్ర ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఇరాన్‌పై అణ్వస్త్ర దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. అణు బాంబులను ఎవరూ.. ఎవరిపైనా వేయటానికి తాము సమ్మతించబోమని తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఆయన తన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై అణు దాడి చేసే అవకాశం ఉందా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఇలాంటి మూర్ఖపు ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు’ అని అన్నారు. అయితే, ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే విషయంలో తనకు తొందరేం లేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్చలకు రాకపోతే మిలిటరీ పరంగాతో ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. లెబనాన్‌లో హెజ్బొల్లాతో మూడు వారాలపాటు కాల్పుల విరమణను పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయని ట్రంప్ చెప్పారు. కాగా, రష్యా తదితర దేశాల నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపును ట్రంప్ మరో 90 రోజులపాటు పొడిగించారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలతోపాటు పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన వాణిజ్య నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని భారత నౌకాయాన శాఖ కార్యదర్శి మన్‌దీ్‌పసింగ్ రణ్‌ధవా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News