Share News

నీరే ఆయుధం

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:24 AM

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి కాళ్లబేరానికి తెచ్చుకొనేందుకు ఇరు దేశాలు...

నీరే ఆయుధం

ఇరాన్‌ నీటి శుద్ధి ప్లాంట్లపై అమెరికా దాడి

  • నడి వేసవిలో తాగునీరు లేక 20 వేల మంది విలవిల

  • ఆగని అమెరికా - ఇరాన్‌ దాడులు

  • ఇరాన్‌ నేతలతో చర్చలు జరిపాం

  • దాడులు ఆపేస్తున్నాం: ట్రంప్‌

దుబాయి, జూన్‌ 11: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి కాళ్లబేరానికి తెచ్చుకొనేందుకు ఇరు దేశాలు అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలకు నీరే ఆయుధంగా మారింది. ఇరాన్‌లో వేలమంది సామాన్య ప్రజలకు జీవనాధారమైన డీశాలినేషన్‌ (సముద్ర నీటి శుద్ధి) ప్లాంట్లను అమెరికా ధ్వంసం చేసింది. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సిరిక్‌ ప్రావిన్స్‌లోని రెండు డీశాలినేషన్‌ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. దీంతో 20 వేల మంది తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌ కూడా అదే విధానాన్ని ఎంచుకుంది. అమెరికా దాడులు ఆపకపోతే కువైట్‌, ఖతార్‌, సౌదీ, యూఏఈ దేశాల డీశాలినేషన్‌ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు జీవనాధారం లాంటి హోర్ముజ్‌ జలసంధిని మళ్లీ పూర్తిగా మూసివేసింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఏ రకమైన నౌకలకూ అనుమతి లేదని, తమ ఆదేశాలను పెడచెవిన పెడితే దాడులు చేస్తామని గురువారం హెచ్చరించింది. బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌లలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో గురువారం దాడులు చేసింది. దీంతో ఆ దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. కువైట్‌లోని అలీ, అహ్మద్‌ అల్‌ జబేర్‌ ఎయిర్‌ బేస్‌లు సహా 18 ప్రాంతాల్లో దాడి చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. బహ్రెయిన్‌లోని షేక్‌ ఇసా ఎయిర్‌బే్‌సపై కూడా దాడి చేసినట్లు పేర్కొంది.

మనసు మార్చుకున్న ట్రంప్‌!

ఇరాన్‌ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమతో వెంటనే శాంతి ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌లోని చమురు, గ్యాస్‌ పరిశ్రమలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దాడుల తీవ్రతను మరింత పెంచుతామని ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. అయితే, గురువారం సాయంత్రానికి మనసు మార్చుకున్నారు. ఇరాన్‌పై దాడులను పూర్తిగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఇరాన్‌ అత్యున్నత నాయకత్వంతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


మా దేశాల్లో దాడులకు ఇరాన్‌దే బాధ్యత

ఇరాన్‌ మద్దతున్న పలు సంస్థలు తమ దేశాల్లో జర్నలిస్టులు, యూదులపై దాడులకు పాల్పడుతున్నాయని 22 దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. కిడ్నా్‌పలు, హత్యలు, అత్యాచారాలతో భయోత్పాతం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల యూరప్‌ దేశాల్లో యూదులు, అమెరికా, ఇరాన్‌ జర్నలిస్టులపై జరిగిన దాడులకు ఇరాన్‌ మద్దతున్న హర కత్‌ అషబ్‌ అల్‌ యమీన్‌ అల్‌ ఇస్లామియా (హయీ) సంస్థ తనదే బాధ్యత అని ప్రకటించుకుంది. గురువారం ఇరాన్‌కు వ్యతిరేకంగా జారీ చేసిన సంయుక్త ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఎస్తోనియా, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐర్లాండ్‌, లాత్వియా, లిథువేనియా, నెదర్లాండ్స్‌, న్యూజీలాండ్‌, ఉత్తర మాసిడోనియా, నార్వే, పోర్చుగల్‌, స్వీడన్‌ తదితర దేశాలు సంతకాలు చేశాయి.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 06:24 AM