యూపీఐ సేవలు ఉచితమే!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:31 AM
యూపీఐ లావాదేవీలు ఉచితంగానే చేసుకోవచ్చునని, వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ‘చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టం...
వ్యక్తుల మధ్య లావాదేవీలకు ఎలాంటి చార్జీలూ ఉండవు
ఎండీఆర్ చార్జీలు కొన్నివ్యాపార లావాదేవీలకే..
కేంద్ర ప్రభుత్వం స్పష్టత
న్యూఢిల్లీ, ఆగస్టు 8: యూపీఐ లావాదేవీలు ఉచితంగానే చేసుకోవచ్చునని, వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ‘చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టం 2007’కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)’ చార్జీలను విధించేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. దీంతో యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి చార్జీలు వసూలు చేస్తారనే భయం ప్రజల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వినియోగదారులు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పట్లాగే ఉచితంగానే, ఎలాంటి రుసుములు లేకుండా కొనసాగుతాయని వివరించింది. ఇక, భవిష్యత్తులో ఎండీఆర్ చార్జీలు అమలులోకి వస్తే నిర్దేశిత పరిమితుల ప్రకారం ఎంపిక చేసిన వర్తకులు జరిపే లావాదేవీలపైనే చార్జీల వసూలు ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆ చార్జీలు కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై వసూలు చేస్తున్న నామమాత్రపు చార్జీల కంటే తక్కువగానే ఉంటాయని పేర్కొంది. అత్యధిక శాతం వ్యాపారులు, వర్తకులకు కూడా యూపీఐ సేవలు ఉచితంగానే లభిస్తాయని తెలిపింది. వ్యాపారులందరి నుంచి ఏకపక్షంగా ఎండీఆర్ వసూలు చేయడం ఉండదని స్పష్టం చేసింది. ‘చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టం 2007’కు సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఎన్‌పీసీఐ నేతృత్వంలోని ‘‘యూపీఐ, సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ’’ ఎండీఆర్‌పై నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. యూపీఐ లావాదేవీలపై చార్జీల వసూలు అంశంపై ఫొన్‌పే సంస్థ కీలక ప్రకటన చేసింది. యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమనేని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు