Share News

స్వీట్ తినమంటే చేతులెత్తి దండం పెట్టిన షాపు యజమాని.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:08 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆహారాన్ని కల్తీ చేసే షాపు యజమానులకు సరైన విధంగా బుద్ధి చెబుతున్నారు.

స్వీట్ తినమంటే చేతులెత్తి దండం పెట్టిన షాపు యజమాని.. వైరల్‌గా మారిన  వీడియో..
UP sweet shop raid

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆహారాన్ని కల్తీ చేసే షాపు యజమానులకు సరైన విధంగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా, హమిర్‌పూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు స్వీట్స్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో తయారయ్యే స్వీట్స్ నాణ్యతను ప్రశ్నించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. స్వీట్ తినమంటే ఓ షాపు యజమాని చేతులెత్తి దండం పెట్టేశాడు. తన షాపులో తయారైన స్వీట్స్‌ను చెత్త బుట్టలో పడేశాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. హమిర్‌పూర్‌లో పలు స్వీట్స్ షాపుల యజమానులు కల్తీకి పాల్పడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు స్వీట్స్ షాపులలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ షాపు దగ్గరకు పోయిన అధికారులు స్వీట్స్ నాణ్యతపై ఆ షాపు యజమానిని పలు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు అతడు సరైన విధంగా సమాధానం చెప్పలేకపోయాడు. అధికారులు ఆ షాపులో తయారైన స్వీట్స్‌ను చేతుల్లోకి తీసుకుని యజమానిని తినమని ఆదేశించారు.


అయితే, ఆ యజమాని స్వీట్ తినడానికి అంగీకరించలేదు. రెండు చేతులు జోడించి అధికారులకు క్షమాపణ చెప్పాడు. తన షాపులో తయారైన స్వీట్స్‌ను చెత్త బుట్టలో పడేశాడు. అధికారులు స్వీట్స్ శాంపిల్స్ తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘తన షాపులో తయారైన స్వీట్స్ తినడానికి అంతలా భయపడుతున్నాడంటే.. ఎంత కల్తీ చేసి ఉంటాడు’.. ‘ప్రజలు ఎక్కడ పడితే అక్కడ తిండి తినకండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

యువతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: గోవా సీఎం ప్రమోద్ సావంత్

ఏఈఈ నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి... ప్రలోభాలు నమ్మొద్దన్న మంత్రి గొట్టిపాటి

Updated Date - Aug 22 , 2026 | 04:17 PM