హంతకులకు హ్యాండ్ ఇచ్చిన బైకు.. మర్డర్ చేసి పారిపోతుండగా..
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:52 PM
ఇద్దరు దుర్మార్గులు లాయర్‌ను తుపాకితో కాల్చి చంపి బైకుపై పారిపోవడానికి చూశారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ అవ్వకుండా హంతకులకు చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీర్జాపూర్, ఏప్రిల్ 11: ఇద్దరు దుర్మార్గులు లాయర్‌ను తుపాకితో కాల్చి చంపి బైకుపై పారిపోవడానికి చూశారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ అవ్వకుండా హంతకులకు చుక్కలు చూపించింది. దాదాపు ఓ నిమిషం పాటు సంఘటనా స్థలం నుంచి ముందుకు వెళ్లకుండా ఆపేసింది. ఆ హంతకులు అతి కష్టం మీద బైక్‌ను స్టార్ట్ చేసుకుని అక్కడినుంచి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. శనివారం ఉదయం మీర్జాపూర్‌కు చెందిన 45 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ రాజీవ్ సింగ్ మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు.
ఈ నేపథ్యంలోనే ఓ బైక్ ఆయనకు దగ్గరగా వచ్చి ఆగింది. ఆ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓ వ్యక్తి బైక్ దిగి రాజీవ్ దగ్గరకు వచ్చాడు. తన చేతిలో ఉన్న నాటు తుపాకితో రాజీవ్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. హంతకులు బైక్‌పై సంఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ కాలేదు. ఎన్నిసార్లు కిక్ కొట్టినా కూడా బైక్ స్టార్ట్ అవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్‌ను కాల్చిన వ్యక్తి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. చాలా సార్లు కిక్ కొట్టిన తర్వాత బైక్ స్టార్ట్ అయింది. వారు అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజీవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. తనపై దాడి జరిగే అవకాశం ఉందని రాజీవ్ ముందే భావించాడు. ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. గతంలో రెండు సార్లు ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రాజీవ్‌ను చంపిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణాఫ్రికా బ్యాటర్
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టిన పోలీసులు