Share News

యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రూల్స్

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:58 AM

ఉత్తర్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రూల్స్ పెట్టింది. ఉద్యోగులు ఉగ్రవాద, హింసాత్మక లేదా అవకతవకలకు పాల్పడితే అనర్హత విధించవచ్చు.

యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రూల్స్
UP Government Jobs New Rules

లక్నో, అక్టోబర్ 29: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఉగ్రవాద, హింసాత్మక, అవకతవకలకు పాల్పడినా, లేదా అలాంటి సంస్థలలో పాలుపంచుకున్న అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించనున్నారు.

హింసాత్మక చర్యలపై నిషేధం: దేశంలో లేదా రాష్ట్రంలో హింస ద్వారా అధికార మార్పిడిని కోరుకునే కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన వారికి ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, లోకల్ బాడీలలో నేరుగా భర్తీ అయ్యే ఉద్యోగాలు లభించవు. అయితే, కేవలం ఒక ప్రత్యేక రాజకీయ భావజాలం లేదా సిద్ధాంతాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ఎవరినీ అనర్హులుగా చేయరు. కేవలం హింసాత్మక ఘటనల్లో పాల్గొంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది.

FIR నమోదైతే ఆటోమేటిక్ అనర్హత కాదు: అభ్యర్థిపై కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన నేరుగా ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించరని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రింది తీవ్రమైన నేరాలలో పాల్గొన్నట్లు తేలితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి

  • ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్రమైన నేరాలు.

  • పరీక్షల పేపర్ లీకేజీలు, సాల్వర్‌ గ్యాంగ్ భాగస్వామ్యం, డమ్మీ అభ్యర్థుల ప్రొక్సీలు.

  • నకిలీ సర్టిఫికెట్ల వినియోగం.

  • సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, UPI ఫ్రాడ్‌లు.

21 ఏళ్ల వయస్సు లెక్కింపు: 21 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గత 3 సంవత్సరాలలో ఇటువంటి హింసాత్మక 'అధికార మార్పిడి' లేదా సమాజ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

30 రోజుల్లో నివేదిక: జిల్లా పోలీస్, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (LIU) క్యారెక్టర్ వెరిఫికేషన్ నివేదికను 30 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమైతే అభ్యర్థి ఇచ్చే స్వీయ ప్రకటన ఆధారంగా తాత్కాలిక నియామక పత్రాన్ని జారీ చేయవచ్చు. ఒకవేళ తర్వాత వెరిఫికేషన్ నెగెటివ్‌గా వస్తే ఉద్యోగం రద్దవుతుంది. ఒకవేళ నివేదిక ప్రతికూలంగా వస్తే, సదరు అభ్యర్థికి ఆన్‌లైన్ లేదా స్వయంగా తన వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కలెక్టర్లు కల్పిస్తారు.

నిర్ణయం వెనుక నేపథ్యం

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అపాయింట్‌మెంట్స్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దేవరాజ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా భారత్‌లో అల్లర్లు సృష్టించి అధికార మార్పిడికి కుట్ర పన్నుతున్నారంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.(UP Government Jobs New Rules)


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Updated Date - Oct 29 , 2026 | 12:09 PM