Share News

ప్రపంచంలోనే తొలిసారిగా దేశంలో గ్రీన్‌స్టీల్‌ ట్యాక్సానమీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:26 AM

2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పానికి అనుగుణంగా గ్రీన్‌స్టీల్‌ ట్యాక్సానమీని ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ నిలిచిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

ప్రపంచంలోనే తొలిసారిగా దేశంలో గ్రీన్‌స్టీల్‌ ట్యాక్సానమీ

  • 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాల సాధనే లక్ష్యం

  • కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పానికి అనుగుణంగా గ్రీన్‌స్టీల్‌ ట్యాక్సానమీని ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ నిలిచిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ 7వ ఎడిషన్‌ స్టీల్‌ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. గ్రీన్‌స్టీల్‌కు స్టార్‌ రేటింగ్‌ విధానాన్ని అమలు చేస్తూ, పరిశ్రమలో పర్యావరణహిత ఉత్పత్తి విధానాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

మార్చి 2026 నాటికి 15 రాష్ట్రంలోని 90 మంది ఉక్కు ఉత్పత్తిదారులు ఈ ప్రమాణాల కింద ధ్రువీకరణ పొందడం ఈ దిశగా సాధించిన పురోగతికి నిదర్శనమన్నారు. అభివృద్థితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం వేగంగా పురోగమిస్తోందని, ఈ మహత్తర లక్ష్య సాధనలో ఉక్కు రంగం వెన్నెముకగా నిలుస్తోందన్నారు.

2030 నాటికి దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 మిలియన్‌ టన్నులకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా స్టీల్‌ కాంక్లేవ్‌లో వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన సంస్థలు, ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, జిందాల్‌ స్టీల్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ నాయకత్వాన్ని ప్రశంసించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జేఎ్‌సడబ్ల్యూ గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు దిశగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ పరిశ్రమల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్థికి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 05:33 AM