Share News

ఉద్ధవ్‌ సేన రెండు ముక్కలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:37 AM

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను వచ్చే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించుకోవాలని సంకల్పించిన ఎన్డీయే ప్రభుత్వం...

ఉద్ధవ్‌ సేన రెండు ముక్కలు

ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌

రేపు శిండే సేనలో చేరే అవకాశం

సమాజ్‌వాదీలోనూ చీలిక తప్పదంటూ ప్రచారం

25మంది ఎస్పీ ఎంపీలు ఎన్డీయేలోకి?.. అదేం లేదన్న అఖిలేశ్‌

ఎన్‌సీపీ(శరద్‌పవార్‌)పైనా బీజేపీ కన్ను .. వాకౌట్‌తో ముఖ్య బిల్లులకు

డీఎంకే సహకారం?.. నె లలోగా 330 దాటనున్న ఎన్డీఏ బలం!

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!

  • సమాజ్‌వాదీ పార్టీ నుంచీ 25మంది ఎస్పీ ఎంపీలు ఎన్డీయేలోకి?

న్యూఢిల్లీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను వచ్చే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించుకోవాలని సంకల్పించిన ఎన్డీయే ప్రభుత్వం అందుకు వీలుగా ఎంపీల సంఖ్యను పెంచుకునే దిశలో వ్యూహాలకు పదునుపెట్టింది. అందులో భాగంగా విపక్షాల్లో చీలికలు తెచ్చి వాటిని ముక్కలు చెక్కలు చేసే యత్నాలను ముమ్మరం చేసింది. ఉద్ధవ్‌ థాక్రే శివసేనలో తాజా తిరుగుబాటు, సమాజ్‌వాదీ కూడా అదే బాటలో నడుస్తోందన్న లీకులు అందులో భాగమే. ముఖ్యంగా ఉద్ధవ్‌ సారధ్యంలోని శివసేన(యూబీటీ) ఇప్పటికే దాదాపు చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఢిల్లీలో కలిశారు. తమను ప్రత్యేకవర్గంగా గుర్తించాలని కోరారు. దీనికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ఓం బిర్లాను కలిసిన వారిలో సంజయ్‌ జాదవ్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, సంజయ్‌ పాటిల్‌, నగేశ్‌ పాటిల్‌, ఓమ్రాజే నింబాల్కర్‌, బాలా సాహెబ్‌ వాక్చౌరే ఉన్నారు. జూన్‌19న(శుక్రవారం) శివసేన 60వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ఏక్‌నాథ్‌ శిండే శివసేనలో ఈ వర్గం విలీనమవుతుంది.

ఎస్పీలోనూ చీలిక?

మరోవైపు, 37 మంది ఎంపీలున్న సమాజ్‌వాది పార్టీలోనూ చీలిక రానుందంటూ యూపీ మంత్రి ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ చేసిన ప్రకటన కలకలం రేపింది. ఎస్పీ ఎంపీలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి పేర్లతో ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారని, ఆ పేర్లు కూడా తనకు తెలుసున్నారు. ఎస్పీ ఎంపీల్లో కనీసం 25 మంది బీజేపీలో చేరతారని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా చెప్పారు. అయితే తమ పార్టీలో పూర్తి ఐక్యత ఉందని, అవన్నీ పుకార్లేనని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కొట్టిపారేశారు. వాస్తవంగా బీజేపీకి చెందిన చాలామంది నాయకులే తమ పక్షం వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.


మూడింట రెండొంతుల మెజారిటీ దిశలో....

543 మంది సభ్యులున్న లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు 362 మంది సభ్యులు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. టీఎంసీ నుంచి వేరుపడి ఎన్సీపీఐలో చేరిన 20 మంది, శివసేన(యూబీటీ) నుంచి శిండే శివసేనలో కలిసే ఆరుగురు ఎంపీలు మద్దతు పలికితే ఎన్డీఏ బలం 317కు చేరుతుంది. శివసేనకు సంబంధించి ఆపరేషన్‌ టైగర్‌ పూర్తి కాగానే 8 మంది సభ్యులున్న ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌)పై దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. వీరిలో నలుగురు మద్దతిచ్చినా, ఎన్డీఏ బలం 321కు చేరుతుంది. వైసీపీకి చెందిన నలుగురు, ఏడుగురు స్వతంత్ర సభ్యుల్లో కనీసం అయిదుగురు తనకు వ్యతిరేకం అయ్యే అవకాశాలు లేవు కనుక ఎన్డీఏ బలం 330కి చేరుతుంది. అయినప్పటికీ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు మరో 32 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఎస్పీలో చీలికతో పాటు డీఎంకే మద్దతు కీలకమవుతుంది. ఇండియా కూటమి నుంచి వేరుపడిన డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు వాకౌట్‌ చేసి బిల్లులకు సహకరించవచ్చునని బీజేపీ వర్గాలంటున్నాయి.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 06:37 AM