Share News

ప్రీ రైడ్‌ టిప్‌లు అడగొద్దు

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:51 AM

ఉబెర్‌, ఓలా, ఇతర ప్రయాణ వాహనాలను బుక్‌ చేసుకునే యాప్‌లలో ఇక నుంచి ప్రీ రైడ్‌ టిప్‌ ఆప్షన్లు కనిపించవు. ప్రయాణికులు క్యాబ్‌ను బుక్‌ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే...

ప్రీ రైడ్‌ టిప్‌లు అడగొద్దు

  • యాప్‌లలో ఈ ఆప్షన్లు తొలగించండి

  • వాహన సేవల సంస్థలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఉబెర్‌, ఓలా, ఇతర ప్రయాణ వాహనాలను బుక్‌ చేసుకునే యాప్‌లలో ఇక నుంచి ప్రీ రైడ్‌ టిప్‌ ఆప్షన్లు కనిపించవు. ప్రయాణికులు క్యాబ్‌ను బుక్‌ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే టిప్‌ చెల్లించాలని అడగవు. యాప్‌లలో ‘అడ్వాన్స్‌ టిప్‌’, ‘చూజ్‌ యాన్‌ యాడ్‌-ఆన్‌’, ‘క్వికర్‌ రైడ్‌ కన్ఫర్మేషన్‌’ వంటి ఆప్షన్లు వెంటనే తొలగించాలని యాప్‌ ఆధారిత వాహన సేవల సంస్థలన్నింటినీ కేంద్రం ఆదేశించింది. మోటార్‌ వాహన నిర్వహణ మార్గదర్శకాలకు ఇవి విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తొందరగా క్యాబ్‌ బుక్‌ చేసుకోవాలని లేదా రైడ్‌ దొరికే అవకాశాలను మెరుగు పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణికులు అదనపు చెల్లింపులు చేసేలా ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది. బుకింగ్‌ ప్రక్రియలో ప్రీ రైడ్‌ ఆప్షన్లు యాప్‌లలో వస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ప్రీ రైడ్‌ టిప్‌ ఇస్తే డ్రైవర్‌ తమ అభ్యర్థనను త్వరగా ఆమోదిస్తారన్న భావన వినియోగదారుల్లో కలుగుతోందని పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రయాణం ముగిసిన తర్వాతే ప్రయాణికులు స్వచ్ఛందంగా టిప్‌ ఇవ్వొచ్చు. అంతేకానీ ముందుగా చెల్లించరాదు. ప్రయాణికులు ఇచ్చే టిప్‌ మొత్తం డ్రైవర్‌కే చెందాలి. వాహన సేవల సంస్థలు ఎలాంటి వాటా తీసుకోకూడదు. బుకింగ్‌ ప్రక్రియలో కేంద్ర మార్గదర్శకాలన్నింటినీ పాటించేలా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో వెంటనే మార్పులు చేయాలని కేంద్రం ఆదేశించింది.

‘సుప్రీం’లో మరో రెండు కోర్టు హాళ్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: సుప్రీంకోర్టులో నూతనంగా రెండు కోర్టు హాళ్లను, వాటికి అనుబంధంగా రెండు రిజిస్ట్రార్‌ హాళ్లను గురువారం సీజేఐ సూర్యకాంత్‌ ప్రారంభించారు. వెస్ట్‌ వింగ్‌లోని మొదటి అంతస్తులో కోర్టు నంబర్లు 18,19 పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచిన నేపథ్యంలో అదనపు కోర్టు హాళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 05:51 AM