Share News

నటి ట్విష శర్మ మరణం.. కోర్టులో లొంగిపోయిన భర్త

ABN , Publish Date - May 22 , 2026 | 08:50 PM

నటి ట్విష శర్మ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. శుక్రవారం జబల్‌పూర్‌ కోర్టుకు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నటి ట్విష శర్మ మరణం.. కోర్టులో లొంగిపోయిన భర్త
Twisha Sharma demise

భోపాల్, మే 22: నటి ట్విష శర్మ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. శుక్రవారం జబల్‌పూర్‌ కోర్టుకు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విష శర్మ మరణించిన నాటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది.


భోపాల్‌లోని కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సమర్థ్ జబల్‌పూర్‌ కోర్టులో లొంగిపోయాడు. మాస్క్, సన్ గ్లాసులు, టోపీ పెట్టుకుని కోర్టులోకి వచ్చాడు. కోర్టు ఆవరణలో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ట్విష మరణించిన 10 రోజుల తర్వాత సమర్థ్ అరెస్ట్ అయ్యాడు.


రెండోసారి పోస్టుమార్టానికి కోర్టు అనుమతి..

ట్విష శర్మ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పోస్టుమార్టం ఢిల్లీ ఏఐఐఎమ్ఎస్ టీమ్ మాత్రమే చేయాలని, అది కూడా భోపాల్‌లోనే పోస్టుమార్టం చేయాలని స్పష్టం చేసింది. ఇక, ట్విష్ కేసులో నిందితురాలిగా ఉన్న సమర్థ్ తల్లి గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.


ట్విషా, ఆమె తల్లిదండ్రుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లను పరిశీలించడంలో సెషన్స్ కోర్టు విఫలమైందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆ చాట్లలో మృతురాలు ట్విష.. గిరిబాలా సింగ్, సమర్థ్‌లపై స్పష్టమైన ఆరోపణలు చేసిందని వారు పేర్కొన్నారు. గిరిబాలా సింగ్ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిందని, దర్యాప్తును ప్రభావితం చేయడానికి కూడా యత్నించిందని పోలీసులు ఆరోపించారు. ఈ రెండు చర్యలు ఆమెకు లభించిన ముందస్తు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమేనని పోలీసులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

Updated Date - May 22 , 2026 | 08:52 PM