Share News

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:16 PM

తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగంపై తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు.

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్
TVK Vijay

సేలం: తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)పై తమిళగ వెట్రి కళగం(TVK) నేత, నటుడు విజయ్ (Vijay) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు. 'వాళ్లు ఇస్తున్న డబ్బులు తీసుకోండి...కానీ విజిల్‌‌కు అండగా నిలవండి' అని ఓటర్లకు పిలుపునిచ్చారు.


ఎన్నికలకు ముందు కలైంగర్ పథకం కింద లబ్ధిదారులైన 1.31 కోట్ల మంది మహిళలకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలకు కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్‌గా రూ.2,000 వారి ఖాతాల్లో స్టాలిన్ ప్రభుత్వం జమచేసింది. దీనిపై సేలంలో శుక్రవారంనాడు జరిగిన టీవీకే ప్రచార ర్యాలీలో విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఒక దుష్టశక్తి అని, టీవీకే మంచిచేసే పార్టీ అని అన్నారు. 'మంచికి ఓటు వేస్తారా? దుష్టశక్తికి ఓటు వస్తారా' అని ప్రశ్నించారు. 'డబ్బులు తీసుకోండి. కానీ విజిల్ (టీఎంకే గుర్తు) ఊదండి' అని కోరారు.


సమ్మర్ ఈ ఏడాది మాత్రమే వస్తుందా?

ప్రత్యేక సమ్మర్ అలవెన్స్‌గా డీఎంకే ప్రభుత్వం రూ.2,000 ప్రకటించడాన్ని విజయ్ ప్రశ్నించారు. 'సమ్మర్ అనేది ఈ ఏడాది మాత్రమే ప్రత్యేకంగా వస్తుందా?. అసలు కారణం అది కాదు. ప్రతి ఇంట్లో, వీధిలో విజిల్ సౌండ్ వినిపిస్తోంది. టీవీకేకు, విజిల్‌కు పెరుగుతున్న మద్దతు, ముఖ్యంగా మహిళల్లో కనబడుతున్న ఆదరణ చూసి స్టాలిన్ బెదిరిపోతున్నారు' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదంటూ డీఎంకే చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అవినీతి చేయడంలో డీఎంకేకు ఉన్న అనుభవం తమకు లేదన్నారు. ప్రజలను ఫూల్స్ చేస్తున్న వారు, అధికారంలో ఉన్నవారినే తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. తాను సుపరిపాలన అందిస్తానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, బూటకపు హామీలు ఇవ్వనని చెప్పారు.


టీవీకే ఈవెంట్లకు వచ్చే వాళ్ల సంఖ్యను 4,998 మందికే పరిమితం చేయడం, ఐడెంటిటీ కార్డులను వెరిఫై చేయడం వంటి ఆంక్షలు విధిస్తుండటాన్ని విజయ్ తప్పుపట్టారు. ఎప్పటికిప్పుడు ఎస్ఓపీలను మారుస్తున్నారని, అయితే స్టాలిన్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తనకు బాగా తెలుసునని అన్నారు. కరూర్ బాధితులకు న్యాయం జరిగేంత వరకూ తాను పోరాటం సాగిస్తానని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా

Updated Date - Feb 13 , 2026 | 04:42 PM