రసవత్తరంగా తమిళనాట రాజకీయాలు.. కోర్టును ఆశ్రయించనున్న విజయ్?
ABN , Publish Date - May 07 , 2026 | 03:01 PM
తమిళనాట రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం వ్యవహారం తమిళనాడు గవర్నర్ పరిధిలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును ధ్రువీకరిస్తూ లేఖను సమర్పించాలని గవర్నర్ ఆర్‌వీ ఆర్లేకర్ విజయ్‌ను కోరినట్టు సమాచారం. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేదన్న సందేహం గవర్నర్‌కు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గురువారం ఉదయం కూడా గవర్నర్ నుంచి విజయ్‌కు పలు ప్రశ్నలు ఎదురైనట్టు తెలిసింది.
తమకు113 ఎమ్మెల్యేలతో (108 టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు) మద్దతుతో పాటు రెండు లెఫ్ట్ పార్టీలు (4 ఎమ్మెల్యేలు), మరో రెండు ప్రాంతీయ పార్టీల (6 ఎమ్యెల్యేలు) మద్దతు ఉందని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఫ్లోర్ టెస్టుకు కూడా తాను సిద్ధమని విజయ్ పేర్కొన్నట్టు సమాచారం. అయితే, విజయ్ ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం టీవీకే అధినేత విజయ్ గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ ప్రతిపాదనకు గవర్నర్ నో చెప్పారు.
ఇక టీవీకేకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, మతవాద శక్తులతో జత కట్టవద్దని విజయ్‌కు షరతు విధించింది. కాంగ్రెస్‌తో పాటు సీపీఐ (ఇద్దరు ఎమ్మెల్యేలు), సీపీఎమ్ (ఇద్దరు ఎమ్మెల్యేలు), వీసీకే (ఇద్దరు ఎమ్మెల్యేలు), పీఎమ్‌కేలను (నలుగురు ఎమ్మెల్యేలు) కలుపుకుంటే టీవీకే సంఖ్యా బలం 122కు చేరుతుంది. ఈ కూటమి ఏర్పాటుకు విజయ్ కూడా సుముఖంగానే ఉన్నారు. అయితే, విజయ్‌కు రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎమ్‌కేతో వీసీకే ఎన్నికల మునుపే జట్టుకట్టింది. ఇక, పీఎమ్‌కే బీజేపీకి మద్దతు పలికింది. దీంతో, తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఈడీ సోదాలు.. భవనం పైనుంచి పడేసిన డబ్బు సంచులు..?
ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. వీడియోలు విడుదల చేసిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్..