గవర్నర్‌కు నిరసన సెగ
ABN , Publish Date - May 08 , 2026 | 05:46 AM
తమిళనాడులో టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించకపోవడంపై వివిధ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ పార్టీ అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు...
లోక్‌భవన్ ఎదుట టీవీకే శ్రేణుల ఆందోళన
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ని ఆహ్వానించాలని డిమాండ్
నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
చెన్నై, మే 7(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించకపోవడంపై వివిధ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ పార్టీ అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుమతించాలని డిమాండ్ చేస్తూ టీవీకే శ్రేణులు గురువారం లోక్‌భవన్ ఎదుట ఆందోళన నిర్వహించాయి. కాంగ్రె స్ సభ్యులు సహా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందంటూ జాబితాను సమర్పించినా.. ఇప్పటి వరకూ విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించలేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అందుకే విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడం లేదని ఆరోపించారు. కాగా, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాము చెన్నైలోనే ఉంటామని తిరుప్పూర్ జిల్లా నుంచి వచ్చిన ఆందోళనకారులు తెలిపారు. మెరీనా బీచ్ వద్ద కూడా టీవీకే శ్రేణులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో లోక్‌భవన్‌తోపాటు, మెరీనా వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రజలు తమ కు అవకాశం ఇస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే దానిని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని టీవీకే నేత అరుణ్‌రాజ్ మండిపడ్డారు. గురువారం ప్రభుత్వ ఏర్పాటు కోసం ఐయూఎంఎల్ పార్టీని మద్దతు కోరిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ శత్రువులుగా న టించిన డీఎంకే-అన్నాడీఎంకే అధికారం కోసం ఎంత కు తెగించాయో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

గవర్నర్ తీరు అప్రజాస్వామికం: కాంగ్రెస్
శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రాజ్యాంగానికి విరుద్ధంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతగై మండిపడ్డారు. గవర్నర్ తీరును ఖండిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
విజయ్‌కు మద్దతుపై నేడు నిర్ణయం
తీసుకుంటామన్న సీపీఐ, సీపీఎం, వీసీకే
అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన టీవీకే అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని సీపీఐ, సీపీఎం, వీసీకే వేర్వేరుగా డిమాండ్ చేశాయి. టీవీకేకు మద్దతు ఇవ్వడంపై శుక్రవారం తగిన నిర్ణ యం తీసుకుంటామని ఆయా పార్టీల నేతలు గురువారం ప్రకటించారు. తమిళనాడులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను గవర్నర్ పాటించాలని సీపీఎం ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ డిమాండ్ చేశారు. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest National News And Telugu News