నెట్టింట అన్నాడీఎంకే చీఫ్ పోస్టు.. తమిళనాడులో మరింత పెరిగిన ఉత్కంఠ
ABN , Publish Date - May 09 , 2026 | 03:34 PM
టీవీకే సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామి పెట్టిన పోస్టు ఉత్కంఠను మరింత పెంచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ ఆయన పోస్టు పెట్టారు. కానీ ఆ పార్టీ పేరును మాత్రం ప్రస్తావించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట రాజకీయాలు అంతకంతకూ ఉత్కంఠను పెంచేస్తున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించాయి. ఇక వీసీకే మద్దతు ప్రకటిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే చీఫ్ నెట్టింట పెట్టిన పోస్టు పరిస్థితిని మరింత రసవత్తరంగా మార్చింది.
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పార్టీకి అభినందనలు చెబుతూ పళనిస్వామి నెట్టింట పోస్టు పెట్టారు. ‘ఇటీవల ముగిసిన 17వ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నేతలు విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పార్టీకి నా శుభాకాంక్షలు’ అని పళనిస్వామి పోస్టు పెట్టారు. కానీ ఆ పార్టీ పేరు మాత్రం తన పోస్టులో ఎక్కడా పేర్కొనలేదు. దీంతో, తమిళనాడులో తదుపరి ఏం జరుగుతుందో అన్న చర్చ పతాకస్థాయికి చేరుకుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు విజయ్‌కు ఉందన్న భావం ప్రతిపక్షంలో ఉందనేందుకు పళనిస్వామి పోస్టు ఒక సంకేతమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, డీఎంకే వ్యతిరేక పార్టీలు, టీవీకే మధ్య తెరవెనుక మరిన్ని చర్చలు జరుగుతున్నాయనేందుకూ ఇదో సంకేతమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత సందిగ్ధ స్థితి సంక్షోభం స్థాయికి చేరకూడదనే అభిప్రాయం పార్టీల్లో కనిపిస్తోందని అంటున్నారు. అయితే, తమ నాయకుడే సీఎం అవుతారంటూ అంతకుముందు ఒక అన్నాడీఎంకే ఎంపీ కామెంట్ చేయడం పరిస్థితిని మరింత ఉత్కంఠ భరితంగా మార్చింది. ఇక తమ నిర్ణయాన్ని నేటి సాయంత్రం ప్రకటిస్తామని వీసీకే పార్టీ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
తమిళనాడు ఎమ్మెల్యేలెవరూ రిసార్ట్‌లో లేరు.. డీకే శివకుమార్
సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం.. మనసు మార్చుకున్న మమతా బెనర్జీ..