కోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్ భార్య.. విడాకుల కోసం పిటిషన్
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:08 PM
తమిళ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తమిళ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (TVK Chief Vijay) వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత విజయ్ (Sangeeta) చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చెంగల్‌పట్టు కోర్టులో విడాకుల పిటిషన్
విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్‌పట్టులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివాహ జీవితం సజావుగా కొనసాగడం లేదని, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించగా.. ఏప్రిల్ 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
1999లో ప్రేమ వివాహం..
విజయ్, సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొన్నేళ్లుగా విభేదాలు..
అయితే, వివాహమైన కొంతకాలం తర్వాతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని సినీవర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
వివాహేతర సంబంధం ఆరోపణలే కారణమా?
విజయ్, త్రిషకు మధ్య సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తమిళనాడుకు చెందిన కొందరు రాజకీయ నేతలు సైతం ఇవే కామెంట్స్ చేశారు. విజయ్ త్రిష ఇంటిని విడిచి ప్రజల్లోకి రావాలంటూ బీజేపీ నాయకుడు నయినర్ నాగేంద్రన్ కామెంట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించడం.. ఆ తర్వాత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇంతలో సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో.. విజయ్ - త్రిష రిలేషన్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
రాజకీయాలపై ప్రభావం?
విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ఆయన రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనే చర్చ జరుగుతోంది. అయితే, విజయ్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
అభిమానుల్లో ఆందోళన
విజయ్ తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఈ వార్త అభిమానులను కలవరపరిచింది. సోషల్ మీడియాలో అభిమానులు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. కొందరు ఇది వ్యక్తిగత విషయం అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు, నరసరావుపేట నేతలకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు
పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News