Share News

మూడోసారి ఎదురుదెబ్బ.. విజయ్ ఆశలపై నీళ్లు చల్లిన టీటీవీ దినకరన్..

ABN , Publish Date - May 09 , 2026 | 07:45 AM

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కష్టాలు తప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవటం వల్ల.. 108 సీట్లు సాధించినా సీఎం పీఠంపై కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్‌ను కలిశారు. మూడోసారి కూడా విజయ్‌కి నిరాశే ఎదురైంది.

మూడోసారి ఎదురుదెబ్బ.. విజయ్ ఆశలపై నీళ్లు చల్లిన టీటీవీ దినకరన్..
Vijay CM Hopes

చెన్నై, మే 9: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కష్టాలు తప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవటం వల్ల.. 108 సీట్లు సాధించినా సీఎం పీఠంపై కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్‌ను కలిశారు. మూడోసారి కూడా విజయ్‌కి నిరాశే ఎదురైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన విజయ్.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను గవర్నర్‌కు అందజేశారు. అయితే, వీటిలో వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు లేవు.


దెబ్బ కొట్టిన టీటీవీ దినకరన్..

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్ కారణంగా విజయ్‌కి ఊహించని షాక్ తలిగింది. విజయ్ గవర్నర్‌కు అందజేసిన మద్దతు లేఖల్లో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్ మద్దతు లేఖ కూడా ఉంది. ఇదే మొత్తం కథను మలుపు తిప్పింది. విజయ్ సీఎం పీఠంపై కూర్చోకుండా అడ్డుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యే మద్దతు లేఖను విజయ్ గవర్నర్‌కు అందించటంపై టీటీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ అందుబాటులో లేరని, ఆయనను అపహరించి ఉండొచ్చని ఆయన ఆరోపించారు.


అర్థరాత్రి గవర్నర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే. ఫిరాయింపుల నిరోధక చట్టం చెల్లదు కాబట్టి.. వారు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అపహరించారు. విజయ్ గవర్నర్‌కు సమర్పించిన మద్దతు లేఖపై ఎమ్మెల్యే కామరాజ్ సంతకం ఉంది. గవర్నర్ అసలు కాపీని అడగటంతో విజయ్ పార్టీ అక్కడినుంచి వెనుదిరిగింది. వాట్సాప్ ద్వారా షేర్ చేసిన ఫొటో కాపీని ఉపయోగించి విజయ్ పార్టీ గవర్నర్‌ను మోసం చేయడానికి ప్రయత్నించింది’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.


కామరాజ్‌కు గవర్నర్ ఫోన్..

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం కామరాజ్‌కు ఫోన్ చేసింది. గవర్నర్ కామరాజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘మీరు మద్దతు లేఖ ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. తాను అలాంటి లేఖ ఇవ్వలేదని కామరాజ్ స్పష్టం చేశారు. అనంతరం గవర్నర్‌ను నేరుగా కలిశారు. ‘నేను అన్నాడీఎంకేకు మాత్రమే మద్దతు ఇస్తాను. విజయ్ టీవీకే పార్టీకి ఇవ్వను’ అని తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..

Updated Date - May 09 , 2026 | 08:04 AM