Share News

అండగా ఉంటాం

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:02 AM

భారత్‌పైగానీ, ప్రధాని మోదీపైగానీ దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం...

అండగా ఉంటాం

మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్‌కు సాయం చేస్తాం

ఎవరైనా దాడి చేస్తే సహాయంగా వస్తాం

మోదీ అందంగా, దేవదూతలా ఉంటారు.. కానీ

ఆయన గొప్ప, కఠిన వాణిజ్య చర్చాకర్త: ట్రంప్‌

హోర్ముజ్‌లో భారత నావికుల మృతిపై దిగ్ర్భాంతి

భారత నావికుల భద్రత మాకు కీలకం: మోదీ

సంక్షోభాలు తలెత్తినా వాణిజ్యం ఆగొద్దు!

జీ7, భారత్‌, గ్లోబల్‌ సౌత్‌ దేశాలతో ‘ఇంపాక్ట్‌’

వేదికను ఏర్పాటుచేయాలి.. జీ7 సదస్సులో మోదీ

భారత్‌ అభివృద్ధి చెందితే ప్రపంచంలో 6వ వంతు

జనాభా అభివృద్ధి చెందినట్టేనని వ్యాఖ్య

4 దేశాల అధినేతలు, ఈయూ నేతలతో భేటీలు

న్యూఢిల్లీ, జూన్‌ 17: భారత్‌పైగానీ, ప్రధాని మోదీపైగానీ దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం భారత్‌కు శ్వేతసౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని చెప్పారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన, సుంకాల విధింపు, ఇటీవల హోర్ముజ్‌లో అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం వంటి ఘటనలతో.. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్రాన్స్‌లోని ఏవియాన్‌ పట్టణంలో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ, ట్రంప్‌ సమావేశమై చర్చించారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. ‘‘భారత్‌, అమెరికా మధ్య గొప్ప సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ భారత్‌పై దాడి జరిగితే.. మేం వారికి సహాయం చేయడానికి వస్తాం. ఒకవేళ ఎవరైనా ఆయన (మోదీ)పై దాడి చేస్తే.. మేం ఆయనకు అండగా వస్తాం.. మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే.. మేం సహాయం చేయడానికి వస్తాం’’ అని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం భారత్‌కు శ్వేతసౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని, అక్కడి వారందరికీ మోదీ అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ట్రంప్‌ స్పందిస్తూ మోదీ కఠినమైన చర్చాకర్త (నెగోషియేటర్‌) అని చెప్పారు. మోదీని చూపిస్తూ.. ‘‘ఈయనను చూడండి. చాలా అందంగా కనిపిస్తారు. దేవదూతలా సున్నితంగా కనిపిస్తారు. కానీ ఆయన చాలా దృఢమైన, కఠినమైన వ్యక్తి. గొప్ప వాణిజ్య చర్చాకర్త. ఆయన భారత ప్రజలను ప్రేమిస్తారు. అలాగే అమెరికానూ ప్రేమిస్తారు. గతంలో మేం హూస్టన్‌లో ‘హౌడీ మోడీ’ కార్యక్రమం నిర్వహించాం. స్టేడియం మొత్తం నిండిపోయింది.


భవిష్యత్తులో మేం భారత్‌కు వెళ్లనున్నాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో భారత్‌ ఎలాంటి పాత్ర పోషించాలని భావిస్తున్నారని ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘భారత్‌ ప్రతీ అంశంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మోదీ నాయకుడిగా ఉన్నంత కాలం భారత్‌ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని సమాధానమిచ్చారు. ఇక హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై అమెరికా చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. తాను ఆ ఘటన గురించి విన్నానని, దిగ్ర్భాంతి కలిగించిందని ట్రంప్‌ చెప్పారు. మరో వైపు ట్రంప్‌తో భేటీలో ప్రధాని మోదీ భారతీయ నావికుల భద్రత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల హోర్ముజ్‌లో నౌకలపై అమెరికా చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో లక్షలాది మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని.. ప్రపంచ వాణిజ్య పురోగతికి తోడ్పడుతున్నారని మోదీ స్పష్టం చేశారు. వారి భద్రత భారత్‌కు అత్యంత ప్రధానమైన అంశమని ట్రంప్‌కు వివరించారు.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 06:02 AM