Share News

త్రిపుర డీజీపీ ఆత్మహత్య!

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:54 AM

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ (60) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం అగర్తలాలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని తన వాష్‌రూమ్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు...

త్రిపుర డీజీపీ ఆత్మహత్య!

తన కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో

ఉరివేసుకొన్న ఉన్నతాధికారి ధన్‌ఖడ్‌

వివరాలను వెల్లడించిన సీఎం మాణిక్‌ సాహా

విచారణ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్‌

అగర్తలా, జూలై 20: త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ (60) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం అగర్తలాలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని తన వాష్‌రూమ్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా వెల్లడించారు. ‘తన చాంబర్‌లోని వాష్‌రూమ్‌లో డీజీపీ ధన్‌ఖడ్‌ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ధన్‌ఖడ్‌ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను. ఆయన కుటుబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని సాహా ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం ధన్‌ఖడ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని.. వారు ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లనున్నారని అధికారులు తెలిపారు. 1994 బ్యాచ్‌ త్రిపుర క్యాడర్‌కు చెందిన అనురాగ్‌ ధన్‌ఖడ్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. గతేడాది మేలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 11 నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ధన్‌ఖడ్‌ అంతకుముందు త్రిపుర డైరెక్టర్‌ జనరల్‌ (ఇంటెలిజెన్స్‌)గా విధులు నిర్వర్తించారు. ఇటు సీబీఐలోనూ పనిచేసిన ధన్‌ఖడ్‌.. పలు కీలక కేసులను దర్యాప్తు చేశారు. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీలు సీపీఎం, కాంగ్రెస్‌ డిమాండ్‌ చేశాయి. ఘటనపై విచారణకు త్రిపుర హైకోర్టు పర్యవేక్షణలో సిట్‌ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జిత్రేంద చౌదరి కోరారు. డీజీపీ మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని చేధించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదీ్‌పరాయ్‌ బర్మన్‌ అన్నారు. ధన్‌ఖడ్‌ ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని.. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలని త్రిపుర బీజేపీ అధ్యక్షుడు అభిషేక్‌ దేబ్రాయ్‌ కోరారు.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 05:54 AM