బెంగాల్‌లో టీఎంసీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:27 AM
పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సోమవారం ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల తిరక్కుండానే ఆ పార్టీలో ఈ పరిణామం...
కోల్‌కతా, జూన్ 1 : పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సోమవారం ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల తిరక్కుండానే ఆ పార్టీలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సాందీపన్ సాహా, రితబ్రత బెనర్జీ అనే ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు టీఎంసీ ప్రకటించింది. కాగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత(ఎల్‌వోపీ)గా తమ పార్టీ నేత సోభన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపే తీర్మానంపై పెట్టిన సంతకాలు తమవి కావని పై ఇద్దరు ఎమ్మెల్యేలు గత నెల 27న స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. మే 6న జరిగిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశంలో సోభన్‌దేబ్‌ను ఎల్‌వోపీగా ఎన్నుకుంటూ ఎటువంటి తీర్మానం చేయలేదని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఈమేరకు తయారుచేసిన లేఖపై ఉన్న 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల్లో 14 బ్లాక్ ఇంక్‌తో ఉన్నాయని, అవి అసలువి కాదని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు బెంగాల్ సీఎం చెప్పారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ సెక్రటేరియట్ హరే స్ట్రీట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై విచారణను సీఐడీ చేపట్టిందని తెలిపారు. సువేందు ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిననిమిషాల్లోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ నుంచి ప్రకటన వెలువడింది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం