తమిళనాట తెలుగు మహిళకు మంత్రి పదవి.. ఎవరీ కీర్తన?
ABN , Publish Date - May 10 , 2026 | 05:27 PM
తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో అతిపిన్న వయసులో మంత్రిగా ఎంపికై కొత్త రికార్డు నెలకొల్పారు కీర్తన. తెలుగు బిడ్డ అయిన ఆమె.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల వెనుక తన వంతు పాత్ర పోషించారు. మారుతున్న సాంకేతికతను అస్త్రంగా చేసుకుని విజయ్ పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రి అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: కీర్తన.. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తున్న పేరిది. రాజకీయ అరంగ్రేట్రంలోనే 108 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తమిళగ వెట్రిగ కళగం(టీవీకే) పార్టీలో 22 మంది మహిళా ప్రజాప్రతినిధులున్నారు. 9 మంది మంత్రుల్లో కేవలం తెలుగమ్మాయి కీర్తనకే మంత్రి మండలిలో చోటు దక్కడం విశేషం. అసలెవరీ కీర్తన? ఆమె రాజకీయ నేపథ్యం ఏమిటి? ఓసారి పరిశీలిస్తే...
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరింది. విజయ్ కేబినెట్‌లో ఇప్పుడు అందరూ కీర్తన గురించే మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం 29 ఏళ్ల వయసులోనే చట్టసభలో గర్జించబోతున్న యువ కెరటం సెల్వి ఎస్.కీర్తన. తమిళ రాజకీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. అతిపిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ కొత్త రికార్డు లిఖించబోతున్నారామె. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా ఓ సామాన్య నేపథ్యం నుంచి వచ్చి.. తన విద్యాబలంతో రాష్ట్ర కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె ఎంపిక కావడం ఓ చారిత్రక ఘట్టం. సీఎం విజయ్ టీమ్‌లో ఆమె నవతరం ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నారు. కీర్తన తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి మంచి మెజారీటీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో ఆమెకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించినట్టు సమాచారం.
2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు కోసం కీర్తన పనిచేశారు. ఆమె తండ్రి కూడా రాజకీయనాయకుడే అయినా.. నేరుగా జనాల్లోకి వెళుతూ తండ్రిని మించిన తనయ అనిపించుకున్నారామె. కీర్తన రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు.. ఓ విద్యావంతురాలైన మేధావి కూడా. ఎమ్మెస్సీ పట్టభద్రురాలైన ఆమెకు చదువుకునే రోజుల నుంచే సమాజం పట్ల, ప్రజా సమస్యల పట్ల చక్కటి అవగాహన ఉంది. రాజకీయాలను అధికారంలా కాకుండా.. ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించారు. డిగ్రీలు పూర్తిచేసిన తర్వాత చాలామంది కార్పొరేట్ ఉద్యోగాల వైపు వెళ్తుండగా.. ఆమె మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే దిశగా ముందడుగేశారు. మార్పు కోసం తపించే యువతకు ఆమె ఒక ప్రతినిధిగా మారి.. రాష్ట్ర రాజకీయాల్లో నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.
ఇవీ చదవండి:
తెలంగాణ వికసిస్తే.. దేశం కూడా వికసిస్తుంది: మోదీ
హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం