మాపై నిషేధం వెనుక రిలయన్స్, వాట్సాప్ కుట్ర!
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:22 AM
నీట్ పరీక్ష నేపథ్యంలో తమ మీద భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వెనుక రిలయన్స్, వాట్సా్‌పల కుట్రలు ఉండవచ్చని టెలిగ్రాం వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఆరోపించారు. బార్డర్ గేట్‌వే ప్రొటోకాల్ (బీజీపీ) అనే టెక్నాలజీతో...
బీజీపీ టెక్నాలజీతో భారత్ బయట కూడా అడ్డుకుంటున్నారు
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ ఆరోపణ
న్యూఢిల్లీ, జూన్ 17: నీట్ పరీక్ష నేపథ్యంలో తమ మీద భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వెనుక రిలయన్స్, వాట్సా్‌పల కుట్రలు ఉండవచ్చని టెలిగ్రాం వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఆరోపించారు. బార్డర్ గేట్‌వే ప్రొటోకాల్ (బీజీపీ) అనే టెక్నాలజీతో భారత్ బయట యూఏఈ తదితర దేశాల్లో కూడా టెలిగ్రాం సేవలు కోట్లాదిమంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘ఇది కావాలని చేసిన కుట్ర. పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా రిలయన్స్ పట్టించుకోలేదు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటాకు రిలయన్స్‌లో కూడా కొంత వాటా ఉన్నందున పోటీ యుద్ధంలో భాగంగా ఇలా వ్యవహరిస్తుండవచ్చు. అంతర్జాతీయస్థాయిలో ఇంటర్నెట్ రూటింగ్‌ను ఇలా దుర్వినియోగపర్చటం దారుణం. రిలయన్స్ నుంచి వచ్చే అనధికారిక బీజీపీ ఎనౌన్స్‌మెంట్లను తిరస్కరించాలని నెట్‌వర్క్ ఆపరేటర్లను కోరుతున్నా’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని టెలికం పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. బీజీపీ రూటింగ్ సమస్యలకు సంబంధించి పావెల్ పేర్కొన్న కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ అని, దాంతో రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన జియోకు సంబంధం లేదన్నారు. ఈ రెండింటినీ ఒకటిగా పావెల్ పొరపడినట్లున్నారని తెలిపారు. జియోలో మెటా పెట్టుబడులు స్వల్పమని, కంపెనీ రోజువారీ వ్యవహారాల్లో మెటాకు సంబంధమే ఉండదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన నీట్ రీఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రాం చానళ్లలో ప్రశ్నపత్రాలను విక్రయిస్తామని ప్రచారం చేస్తున్న ముఠాలను నిలువరించే ఉద్దేశంతో కేంద్రం.. టెలిగ్రాంపై ఈ నెల 22 వరకూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత నిషేధం తొలగినా.. 30వ తేదీ వరకూ మెసేజీల ఎడిటింగ్ సదుపాయం అందుబాటులో లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, ఈ తాత్కాలిక నిషేధాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల భారత్‌లో ఉన్న 15 కోట్ల మందికిపైగా టెలిగ్రాం వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. జస్టిస్ తేజస్ కరియా విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. టెలిగ్రాం ప్లాట్‌ఫాంను తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్న ఘటనలు ఉన్నాయని, అందుకనే తాత్కాలిక నిషేధం విధించామన్నారు. తనకు గడువు ఇస్తే దిగ్ర్భాంతికరమైన వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్