Share News

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో మెరిసిన తెలంగాణ

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:59 AM

గాలి నాణ్యత పెంపు, కాలుష్య నివారణ వంటి చర్యల్లో తెలంగాణ నగరాలు, పురపాలక వార్డులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాయి. అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం 2026 సందర్భంగా నిర్వహించిన 5వ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ పురస్కారాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది.

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో మెరిసిన తెలంగాణ
Swachh

  • కేటగిరీ-3లో రెండోస్థానంలో నల్లగొండలోని 16వ వార్డు

  • రాష్ట్ర స్థాయి కేటగిరీలో జూబ్లీహిల్స్‌, గన్‌ఫౌండ్రీ, సంగారెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): గాలి నాణ్యత పెంపు, కాలుష్య నివారణ వంటి చర్యల్లో తెలంగాణ నగరాలు, పురపాలక వార్డులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాయి. అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దినోత్సవం 2026 సందర్భంగా నిర్వహించిన 5వ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ పురస్కారాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది. సోమవారం ఢిల్లీలో ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ప్రకాష్‌ శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి తన్మయ్‌ కుమార్‌ సమక్షంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేటగిరీ-3 పట్టణాల విభాగంలో 10 వేలలోపు జనాభా కలిగిన వార్డుల విభాగంలో నల్లగొండ పట్టణంలోని 16వ వార్డు దేశంలోనే రెండో ర్యాంకు సాధించి రికార్డు సృష్టించింది. అలాగే, కేటగిరీ-3 నగరాల విభాగంలో 3 లక్షల జనాభాలోపు ఉన్న తెలంగాణకు చెందిన రెండు పట్టణాలు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. సంగారెడ్డి 186.8 స్కోరుతో దేశంలోనే 8వ ర్యాంకు సాధించగా, నల్లగొండ 185.8 స్కోరుతో 10వ ర్యాంకు పొందింది. కేటగిరీ-1 నగరాల విభాగంలో (10 లక్షలలోపు జనాభా) హైదరాబాద్‌ నగరం 174.2 స్కోరుతో జాతీయ స్థాయిలో 19వ ర్యాంకు సాధించింది. ఈ కేటగిరీలో లక్నో తొలి స్థానంలో, ఇండోర్‌ రెండో స్థానంలో నిలిచాయి. ఇక, రాష్ట్రస్థాయిలో కేటగిరీ-1 (30 వేలలోపు జనాభా)లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, కేటగిరీ -2 (10 వేల -30 వేల జనాభా)లో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ, కేటగిరీ-3 (10 వేలలోపు జనాభా)విభాగంలో సంగారెడ్డిలోని 31వార్డు ప్రతిభ చూపాయి.

ఇవి కూడా చదవండి

తల్లిని అవమానిస్తే.. కొడుకు రక్తం మరగదా?

రాష్ట్రంలో ‘సర్‌’ గడువు పొడిగింపు

Updated Date - Sep 08 , 2026 | 04:59 AM