Share News

తేజస్‌ ఎంకే-2 ఎందుకూ పనికిరాదు

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:48 AM

యుద్ధ విమానాల విషయంలో భారతదేశ పరిస్థితిపై భారత వాయుసేన రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తేజస్‌ ఎంకే-2 ప్రాజెక్టుపై ఆయన అసంతృప్తి...

తేజస్‌ ఎంకే-2 ఎందుకూ పనికిరాదు

  • ఆ యుద్ధ విమానం అందుబాటులోకి వచ్చేనాటికి చైనా వద్ద 6వ తరం, పాక్‌ వద్ద 5వ తరం జెట్లు ఉంటాయి

  • తేజస్‌ ఎంకే-2.. 4వ తరం ఫైటరే

  • రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 22: యుద్ధ విమానాల విషయంలో భారతదేశ పరిస్థితిపై భారత వాయుసేన రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తేజస్‌ ఎంకే-2 ప్రాజెక్టుపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. తేజస్‌ ఎంకే-2 యుద్ధ విమానాలు భవిష్యత్తులో ఎందుకూ పనికిరావని కుండబద్ధలు కొట్టారు. హెచ్‌ఏఎల్‌ సంస్థ తయారుచేస్తున్న ఈ విమానాలు తేజస్‌ ఎంకే-1, తేజస్‌ ఎంకే-1ఏ యుద్ధ విమానాలకు తర్వాతి తరం వర్షన్‌. ఇవి 4 లేదా 4.5 జనరేషన్‌ విమానాలని చెబుతున్నారు. వీటిని 2030 నాటికి వాయుసేనకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శనివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విమానాలపై నగేశ్‌ పెదవి విరిచారు. ‘తేజస్‌ ఎంకే-2 విమానాలను వాయుసేనలో చేర్చే నాటికి చైనా వద్ద 6వ తరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్లు ఉంటాయి. పాకిస్థాన్‌ వద్ద 5వ తరం జెట్లు ఉండవచ్చు. కానీ, ఎంకే-2లు 4వ తరానివే. అందునా వీటిలో ఉండే టెక్నాలజీ అప్పటికి పాతబడిపోతుంది’ అని తెలిపారు. భారతీయ మొదటి స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ కోసం చేపట్టిన ఆమ్కా ప్రాజెక్టుపై కూడా ఆయన పెదవి విరిచారు. ఈ విమానాలు 2035 నాటికి సిద్ధమవుతాయని భావిస్తున్నామని, అప్పటికి ప్రపంచం చాలా ముందుకు పోతుందని అన్నారు. అత్యాధునిక యుద్ధ విమానాల విషయంలో చైనాతో పోటీపడాలంటే యూరోపియన్‌ కన్సార్టియంతో భారత్‌ జట్టుకట్టాలని సూచించారు. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ సంయుక్తంగా చేపట్టిన ఫ్యూచర్‌ కంబాట్‌ ఎయిర్‌ సిస్టమ్‌ (ఎఫ్‌సీఏఎస్‌), జపాన్‌, బ్రిటన్‌, ఇటలీల సంయుక్త ప్రాజెక్టు అయిన గ్లోబల్‌ కంబాట్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (జీసీఏపీ)లో ఏదో ఒకదానిలో భారత్‌ చేరటం అవసరమని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 05:48 AM