PSLV-C62 Launch: పీఎస్‌ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం.. శాటిలైట్‌తో తెగిన సంబంధాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:19 AM
పీఎస్‌ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాలుగో దశలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాల్లోనే పూర్తి కావాల్సిన ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాలుగో దశలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాల్లోనే పూర్తి కావాల్సిన ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం అవుతోంది. ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. ‘పీఎస్‌ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. ప్రయోగం మూడో దశ వరకు సాఫీగా సాగింది. మూడో దశ తర్వాత సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక సమస్యపై విశ్లేషిస్తున్నాం’ అని అన్నారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రోజు(సోమవారం) ఉదయం 10:18 గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది. కొత్త ఏడాదిలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావటం విశేషం. పీఎస్‌ఎల్వీ-సీ62 రాకెట్ అధునాతన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-ఎన్1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా మూడవ దశ తర్వాత శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఈవోఎస్-ఎన్ 1ను వాతావరణ మార్పులు, పర్యావరణ పరిశోధన నిమిత్తం కక్ష్యలోకి పంపుతున్నారు. దీంతోపాటు పంపే మిగతా 15 ఉపగ్రహాలనూ ధృవ కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెడుతుంది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలున్నాయి. వీటితో భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 442కు చేరుతుంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 22 గంటల ముందు అంటే.. ఆదివారం మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ-సీ 62 ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ శనివారం శాస్త్రవేత్తలతో కలిసి తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వర స్వామిని, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి పాదాల చెంత ఉపగ్రహం నమూనాను ఉంచి పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి
కొనసాగుతున్న నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్.. వైరల్‌గా మారిన పోస్ట్..