విద్యార్థులతో కలిసి మద్యం సేవించిన టీచర్లు.. చివరకు.?
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:40 PM
విద్యార్థులతో కలిసి టీచర్లు మద్యం సేవించిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇలా కొందరు చెత్త పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే అపకీర్తి తెస్తున్నారు. వివరాల్లోకెళితే...
బిహార్, మార్చి 28: విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులు కీలక పాత్ర పోషిస్తుంటారు. పిల్లల్లోని అజ్ఞానం తొలగించి.. విజ్ఞాన కాంతులు వెలిగిస్తుంటారు. అందుకే ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. కానీ.. కొందరు గురువులు మాత్రం చెత్తపనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఐదుగురు టీచర్లు విద్యార్థులతో కలిసి మద్యం సేవించిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'బిహార్ దర్శన్' పథకం కింద ఓ పాఠశాల విద్యార్థుల బృందం నేపాల్ వెళ్లింది. వీరితో పాటు కొందరు ఉపాధ్యాయులూ ఉన్నారు. నేపాల్ పర్యటన పూర్తై.. తిరిగొచ్చే క్రమంలో భీమ్‌నగర్ చెక్‌పోస్ట్ వద్ద ఈ బృందాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి ఐదుగురు ఉపాధ్యాయులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా సీనియర్ పోలీస్ అధికారి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఐదుగురు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నేపాల్ నుంచి వస్తున్నారు. ఇక్కడ ప్రతి వ్యక్తిని, ప్రతి వాహనాన్ని సాధారణంగా తనిఖీ నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా వారిని ఆపి, బ్రీత్-ఎనలైజర్ మెషీన్‌తో పరీక్షించాం. వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది' అని తెలిపారు.
బిహార్‌లో మద్యంపై పూర్తి నిషేధం ఉందని, దీని ప్రకారం మద్యం సేవించడం, కొనుగోలు చేయడం, అమ్మడం రవాణా చేయడం కచ్చితంగా నిషిద్ధమని అధికారి తెలిపారు. మద్యం సేవించిన ఉపాధ్యాయులను శివాంశ్ కుమార్, దీప్ నారాయణ్ రామ్, ఇంగ్లిష్ కుమార్, ధీరేంద్ర కుమార్, మిథు కుమార్‌లుగా గుర్తించారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. శాఖ పరమనై చర్యలు తీసుకునేందుకు వీలుగా, ఈ విషయాన్ని సంబంధిత విద్యా శాఖకు కూడా తెలపామన్నారు. ఈ ఘటన అనంతరం స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కలిగి ఉపాధ్యాయుల ఇటువంటి పనులు చేయడం అత్యంత సిగ్గుచేటని, అలాగే సమాజానికే ప్రమాదకరమైందని నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ప్రక్రియ ప్రారంభమైందని సుపాల్ జిల్లా మేజిస్ట్రేట్ శావన్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం