జావెలిన్ మిసైల్స్ తయారీ.. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో ఒప్పందం
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:52 PM
యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగిన జావెలిన్ మిసైల్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, జావెలిన్ జాయింట్ వెంచర్ (జేజేవీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది
ఇంటర్నెట్ డెస్క్: యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగిన జావెలిన్ మిసైల్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, జావెలిన్ జాయింట్ వెంచర్ (జేజేవీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, భారత్‌లో మిసైల్స్ అసెంబ్లీ అండ్ ఇంటిగ్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన రక్షణ రంగ సంస్థలు లాక్‌హీడ్ మార్టిన్, ఆర్‌టీఎక్స్ బిజినెస్ సంయుక్తంగా జేజేవీని ఏర్పాటు చేశాయి. ఒప్పందం కుదిరిన విషయంపై ఆ సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. అమెరికా నుంచి జావెలిన్ మిసైల్స్ కొనుగోలుకు భారత ఆర్మీ ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే.
జావెలిన్ మిసైల్ ఉత్పత్తికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ను ప్రధాన భాగస్వామ్య సంస్థగా ఎంపిక చేశామని జేజేవీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఎమ్ఓయూ ప్రకారం, జావెలిన్ మిసైల్స్‌కు సంబంధించి తుది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ కేంద్రాన్ని ఇరు సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి. విడిభాగాల ఉత్పత్తి అవకాశాలను కూడా పరిశీలించనున్నాయి. భవిష్యత్తులో కూడా భారత్‌లో జావెలిన్ వ్యవస్థల ఉత్పత్తికి సహకరించేందుకు అంగీకారం కుదిరింది.
జావెలిన్ అగ్రిమెంట్ గురించి గత వారం అమెరికా రాయబారి సెర్గియో మాట్లాడుతూ రక్షణ రంగంలో యూఎస్, భారత్‌ల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. కలిసి పనిచేస్తే ఇరు దేశాల కంపెనీలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. జావెలిన్ మిసైల్‌ను యూఎస్ ఆర్మీ ఇప్పటికే వినియోగిస్తోంది. అంతర్జాతీయంగా అనేక దేశాలు దీన్ని వినియోగిస్తున్నాయి. సైనికులు తమ భుజంపై నుంచి ప్రయోగించే ఈ మిసైల్స్ యుద్ధ ట్యాంకులతో పాటు అనేక ఇతర ఆర్మర్డ్ (రక్షణ కవచం) మిలిటరీ వాహనాలను, శత్రుస్థావరాలను ధ్వంసం చేస్తాయి.
ఈ వార్తలనూ చదవండి:
మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వార్నింగ్
సండే పార్టీలో దారుణం.. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని స్నేహితుడి హత్య..