మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వార్నింగ్
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:43 PM
న్యూయార్క్‌లో భారత జాతీయ జెండాను అవమానించిన ఖలిస్థానీ వేర్పాటువాదులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లో భారత జాతీయ జెండాను అవమానించిన ఖలిస్థానీ వేర్పాటు వాదులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. న్యూయార్క్‌లో మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా జరిగిన సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరైన సందర్భంగా స్టేడియం బయట జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను మంత్రి నెట్టింట షేర్ చేశారు.
‘ఆర్ఎస్ఎస్‌ను లేదా బీజేపీని విమర్శించే హక్కు మీకు ఉందని మేము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాము. కానీ మా దేశాన్ని అవమానించవద్దు. మీరు ఓ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మా దేశాన్ని, జెండాను అవమానిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని కేంద్ర మంత్రి తన పోస్టులో వార్నింగ్ ఇచ్చారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్టేడియం బయట ఖలిస్థానీలు నానా రభసా సృష్టించారు. ఓ వ్యక్తి తన కాలికి భారత జాతీయ జెండాను చుట్టుకుని అటూ ఇటూ ఊపుతూ అవమానించాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెట్టింట పలువురు డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆర్ఎస్ఎస్ సంస్థ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో AHEAD సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన ఈ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. అమెరికాలో ఉంటూ ఉపాధి పొందే వారు కర్మ భూమి పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాల్లో హిందువులు బాధ్యతాయుత జీవనంతో ఆదర్శవంతంగా నిలవాలని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. నిందితుల అరెస్ట్