Share News

సండే పార్టీలో దారుణం.. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని స్నేహితుడి హత్య..

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:55 PM

కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సండే పార్టీ సందర్భంగా స్నేహితుల మధ్య గొడవలో ఓ నిండు ప్రాణం బలైంది. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు.

సండే పార్టీలో దారుణం.. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని స్నేహితుడి హత్య..
Belagavi Chicken Party

బెంగళూరు, ఆగస్టు 31: కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సండే పార్టీ సందర్భంగా స్నేహితుల మధ్య గొడవలో ఓ నిండు ప్రాణం బలైంది. చికెన్ ముక్కలు ఎక్కువగా తిన్నాడని ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సీతారామ్, అరుణ్.. కర్ణాటక, బెలగావిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈ ఇద్దరూ మరో నలుగురితో కలిసి ఓ షెడ్‌లో ఉంటున్నారు. ఆదివారం సెలవు కావటంతో రూమ్‌మేట్స్ అందరూ మందు పార్టీ చేసుకున్నారు.


పార్టీ కోసం చికెన్ కూడా చేసుకున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో.. చికెన్ ముక్కల విషయంలో సీతారామ్, అరుణ్‌కు మధ్య గొడవ మొదలైంది. అరుణ్ ఎక్కువ చికెన్ ముక్కలు తింటున్నాడని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలోనే అరుణ్ వంట చేసే కత్తితో సీతారామ్ ఛాతిలో పొడిచాడు. సీతారామ్ ప్రాణాల కోసం గిలగిల్లాడుతుండటంతో అరుణ్ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాడు. బిల్డింగ్ మీదనుంచి కిందపడ్డాడని డాక్టర్లకు అబద్ధం చెప్పాడు.


సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అరుణ్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. గొడవ కారణంగా కత్తితో పొడిచినట్లు చెప్పాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారామ్ చనిపోవటంతో పోలీసులు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

మజ్లిస్‌లో ధిక్కార స్వరం.. రాజీనామాకు ఎమ్మెల్సీ రహ్మత్ ససేమిరా

నేపాల్ వరదలకు కారణం ఇదే.. వైరల్‌గా మారిన డ్రోన్ విజువల్స్..

Updated Date - Aug 31 , 2026 | 01:02 PM