విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!
ABN , Publish Date - Jul 02 , 2026 | 06:36 AM
తమిళనాడులోని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్ సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని...
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్.. టీవీకే ఎమ్మెల్యేతో యూట్యూబర్ బేరసారాలు
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురి అరెస్టు
నిందితులు డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ అనుచరులు
చెన్నై, జూలై 1(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్ సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీకి చెందిన పదిమంది శాసనసభ్యులకు తలా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు బేరసారాలు జరిపారన్నది ఆరోపణ. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులు డీఎంకేకు చెందిన మాజీమంత్రి సెంథిల్‌బాలాజీ అనుచరులు. కృష్ణగిరి జిల్లా ఊత్తాంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్.ఇళయరాజాకు ఇటీవల ఓ యూట్యూబర్ ఫోన్ చేసి ఈ బేరసారాలు జరపటంతో ఆయన గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ అమల్‌రాజ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలంటూ ట్రిప్లికేన్ పోలీసులను కమిషనర్ ఆదేశించారు. దీనిపై ప్రత్యేక దళం పోలీసులు లోతైన విచారణ జరిపి చెన్నై ఆరుంబాక్కం ప్రాంతానికి చెందిన యూట్యూబర్ తిరునావుక్కరసును అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా తిరుచ్చికి చెందిన నరేష్, చెన్నైకి చెందిన త్యాగరాజన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌కుమార్, వీరి అనుచరులకు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో కనుగొన్నారు. ఆ మేరకు కరూర్‌లో ఉన్న సెంథిల్‌బాలాజీ అనుచరుడు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ అధినేత రమేష్, శక్తిమెస్ నిర్వాహకుడు కార్తీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ బుధవారం చెన్నైకి తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇక తిరునావుక్కరసు, నరేష్, త్యాగరాజన్‌లను పోలీసులు ఎగ్మూరు కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఓ ప్రధాన పార్టీ సూచనలతోనే..
చెన్నై నుంచి ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీ్‌స(ఐపీడీఎస్) అనే అభిప్రాయ సేకరణ సంస్థ తరఫున మాట్లాడుతున్నానంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి ఇటీవల టీవీకే శాసనసభ్యుడు ఇళయరాజాకు ఫోన్ చేశారు. ఓ ప్రధాన పార్టీకి చెందిన ప్రముఖుల సూచనల ప్రకారం తాను నేరుగా కలుసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. ఆ సమయంలో తాను బిజీగా ఉన్నానంటూ ఇళయరాజ్ ఫోన్ కట్ చేశారు. తిరునావుక్కరసు మళ్లీ ఆయన్ని ఫోన్‌లో సంప్రదించి అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేయబోతున్నారని, ఆ తీర్మానానికి జరిగే ఓటింగ్‌లో టీవీకేకు వ్యతిరేకంగా ఓటేయాలని, అలా చేస్తే రూ.35 కోట్ల దాకా చెల్లిస్తామని తెలిపాడు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రసక్తే లేదని ఇళయరాజా ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత తిరునావుక్కరసు మళ్లీమళ్లీ ఫోన్ చేసి తన సంభాషణను బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పదే పదే బెదిరించాడు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు విజయ్ బేరసారాలు!
తమిళనాడు గవర్నర్‌కు డీఎంకే ఫిర్యాదు
తన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుపుతున్న టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ అర్లేకర్‌కు డీఎంకే పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఎండీఎంకే తరఫున కడయనల్లూరు, సీర్గాళి నియోజకవర్గాలలో డీఎంకే చిహ్నం ఉదయించే సూర్యుడి గుర్తుపై పోటీ చేసి గెలిచిన టీఎం రాజేంద్రన్, సెంథిల్ సెల్వన్ తో రాజీనామా చేయించేందుకు విజయ్ ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమ కూటమి నుంచి వైదొలగిన ఎండీఎంకే నేత వైగో విలేకరుల సమావేశంలోనే ప్రకటించారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేస్తే, ఉప ఎన్నికల్లో ఆ ఇద్దరినీ గెలిపించేందుకు తానే ప్రచారం చేస్తానని విజయ్ హామీ ఇచ్చారని వైగో ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారని గుర్తు చేశారు. అలా బేరసారాలు జరిపే అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని ఆరోపించారు. తన ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేసి గండం నుంచి బయటపడవచ్చనే తలంపుతోనే విజయ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి, తగిన చర్యలు చేపట్టాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News