టీవీకేకు కాంగ్రెస్ మద్దతు! డీఎమ్‌కేలో భిన్న స్వరాలు
ABN , Publish Date - May 06 , 2026 | 07:39 PM
ఇండియా కూటమి ముఖ్య భాగస్వామి కాంగ్రెస్ టీవీకే పార్టీతో పొత్తుకు సిద్ధం కావడంపై డీఎమ్‌కే పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఆ హక్కు ఉందని డీఎమ్‌కే ఎంపీ కనిమొళి పేర్కొనగా పార్టీ ప్రతినిధి అన్నాదురై మాత్రం కాంగ్రెస్ నిర్ణయాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అక్కడి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమిలో ఈ విషయమై ఇప్పటికే కలకలం రేగుతోంది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని కూటమి భాగస్వామి కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పరిణామాన్ని డీఎమ్‌కేలోని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డీఎమ్‌కే అధినేత స్టాలిన్ ఇంకా స్పందించనప్పటికీ పార్టీ ప్రతినిధి శరవణన్ అన్నాదురై మాత్రం కాంగ్రెస్‌పై భగ్గుమన్నారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో గెలిచాక టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర ప్రజలకు, తన నియోజకవర్గ ప్రజలకు కాకుండా మొదట ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి రాహుల్ గాంధీ ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. ఇండియా కూటమి భావజాల సారూప్యత ఆధారంగా ఏర్పడిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీని దూరంగా ఉంచేందుకే పొత్తుకు సిద్ధమయ్యామన్న కాంగ్రెస్ వాదనలో పసలేదని స్పష్టం చేశారు. కూటమిలోని ఇతర పార్టీలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలు ఎల్లప్పుడూ కాంగ్రెస్‌కు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
మరోవైపు డీఎమ్‌కే ఎంపీ కనిమొళి మాత్రం ఈ విషయమై ఆచితూచి స్పందించారు. తమకు సరైనదిగా అనిపించిన మార్గాన్ని ఎంచుకునే హక్కు కూటమి భాగస్వాములకు ఉంటుందని అన్నారు. ‘మేము ఎన్నో ఎన్నికల్లో కలిసి గెలిచాము. ఈ ఎన్నికలో మాత్రం ఓడిపోయాము. నా అభిప్రాయం ప్రకారం, తమకు సరైనదనిపించిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు కూటమి భాగస్వాములకు ఉంటుంది. కాబట్టి ఇతర పార్టీల విషయంలో నేను ఇంతకు మించి చెప్పేందుకు ఏమీ లేదు. కానీ మేము మాత్రం మా పోరాటాన్ని కొనసాగిస్తాము’ అని ఆమె అన్నారు. అయితే, కూటమి భాగస్వాములు ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉండాలని పార్టీ అధినేత స్టాలిన్ చెబుతారని కూడా కనిమొళి పేర్కొన్నారు. భావజాల సారూప్యత ఆధారంగా ఇండియా కూటమి ఏర్పడిందని కూడా ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రంలో డీఎమ్‌కేకు ప్రత్యామ్నాయ సెక్యులర్ పార్టీగా టీవీకే అవతరిస్తోందన్న వార్తలపై తమకు ఎలాంటి ఆందోళన లేదని కూడా కనిమొళి అన్నారు. సెక్యులర్ పార్టీలు ఉనికిలోకి రావడం రాష్ట్రానికి మంచిదని అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎమ్)లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.