తమిళనాడు గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ ఆగ్రహం.. రేపు లోక్‌భవన్ ముట్టడికి పిలుపు
ABN , Publish Date - May 07 , 2026 | 04:51 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన TVK అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతోంది. రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
చెన్నై, మే 7: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశం ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది. అత్యధిక స్థానాలు సాధించిన TVK అధినేత విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టబోతోంది. గవర్నర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
లోక్ భవన్ ముట్టడి.. జిల్లాల్లో ధర్నాలు
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు చెన్నైలోని గవర్నర్ అధికారిక నివాసం (లోక్ భవన్)ను ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. కేవలం చెన్నైలోనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ ఈ నిరసనలకు శ్రీకారం చుట్టింది.
గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ ఫైర్
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరు కేవలం కాలయాపన చేయడమేనని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న TVKకి, కాంగ్రెస్ (5 సీట్లు) వామపక్షాల మద్దతు కలిపితే మెజారిటీకి చేరువలో ఉన్నామని, ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 'ప్రజలు మార్పును కోరుకున్నారు, కానీ గవర్నర్ మాత్రం ఢిల్లీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు' అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు
కాంగ్రెస్ పిలుపుతో తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే TVK కార్యకర్తలు ఆందోళనలో ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తోడవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకే అధినేత విజయ్‌ను వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని బీజేపీ రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని చూస్తోందని.. అందుకోసమే, రేపు ఉదయం నుంచే తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్ల మీదకు రానున్నాయని కాంగ్రెస్ ప్రకటించింది.