అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:48 AM
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ తన ఎక్స్ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళత్తాయ్ గీతాన్ని మొదటగా ఆలపించాలనే తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించడం సంతోషకరం. ఇది కచ్చితంగా స్వాగతించదగినది. రాష్ట్ర హక్కులను వదులుకోని ఈ విధానం ఇలాగే కొనసాగాలి’ అని రాసుకొచ్చారు.
కేంద్రం వర్సెస్ తమిళనాడు..
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గేయమైన 'వందేమాతరం'ను మొదటగా ఆలపించాలని, ఆ తర్వాతే ఇతర గీతాలను ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత మార్గదర్శకాలను, సూచనలను జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన ప్రాణం, భావోద్వేగం’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం విజయ్ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక తీర్మానానికి అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
రాజస్థాన్ వీడియోతో పంజాబ్‌లో రాజకీయ దుమారం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు