నార్వే చెస్ విజేత ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం..
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:03 PM
నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనతో సరదాగా చదరంగం కూడా ఆడారు.
ఇంటర్నెట్ డెస్క్: నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రత్యేకంగా సత్కరించారు. తమిళనాడు సచివాలయంలో ప్రజ్ఞానందను కలిసిన సీఎం విజయ్, రూ.50 లక్షల నగదు బహుమతి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రజ్ఞానందతో సరదాగా చదరంగం ఆడారు. ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి ఆటలో ప్రజ్ఞానంద కొద్ది ఎత్తుల్లోనే ముఖ్యమంత్రికి చెక్‌మేట్ ఇచ్చారు. ఆట అనంతరం ముఖ్యమంత్రితో చెస్ ఆడే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని ప్రజ్ఞానంద తెలిపారు. ఇది తనకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి కూడా తన స్నేహితులతో తరచూ చదరంగం ఆడతానని చెప్పారని వెల్లడించారు.
ఇటీవల నార్వేలోని ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచారు. చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ప్రజ్ఞానంద సాధించిన ఈ ఘనత భారత చెస్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.
Also Read:
ఢిల్లీలో భారీ ఈదురుగాలులు.. మూడు విమానాల ధ్వంసం..
ఇండియా కూటమి సమావేశానికి వర్చువల్‌గా హాజరు కానున్న ఉద్ధవ్ థాకరే