సింగూర్ ఔట్.. ముఖర్జీ ఇన్.. బెంగాల్ పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పు.. సీఎం సూచన..
ABN , Publish Date - Jul 07 , 2026 | 03:29 PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర పాఠ్యపుస్తకాల విషయంలో కీలక ప్రతిపాదన చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలను పాఠశాల సిలబస్‌లో చేర్చాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర పాఠ్యపుస్తకాల విషయంలో కీలక ప్రతిపాదన చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలను పాఠశాల సిలబస్‌లో చేర్చాలని సూచించారు. అదే సమయంలో సింగూర్ ఉద్యమానికి సంబంధించిన పాఠాలను సిలబస్ నుంచి తొలగించాలని కూడా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి (Syama Prasad Mookerjee).
కోల్‌కతాలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సువేందు మాట్లాడారు. 'సిలబస్‌ను రాజకీయ నాయకులు నిర్ణయించరు. కానీ ప్రజాప్రతినిధిగా నేను ఒక ప్రతిపాదన చేయవచ్చు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, పశ్చిమ బెంగాల్ ఏర్పాటులో ఆయన పాత్ర, అవిభాజ్య భారతదేశంపై ఆయన ఆలోచనలు, పార్లమెంట్ ప్రసంగాలు, కేంద్ర మంత్రిగా, కలకత్తా విశ్వవిద్యాలయానికి వీసీగా ఆయన అందించిన సేవలను విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది' అని సువేందు పేర్కొన్నారు (West Bengal School Syllabus).
'2008లో టాటా మోటార్స్ నానో కారు ప్రాజెక్టు సింగూర్ నుంచి వెళ్లిపోవడానికి దారితీసిన ఉద్యమానికి సంబంధించిన అంశాలు పాఠ్యపుస్తకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే తుది నిర్ణయం సిలబస్ కమిటీదే. నేను కేవలం ప్రతిపాదన మాత్రమే చేస్తున్నాను' అని సువేందు స్పష్టం చేశారు.
టాటా మోటార్స్ నానో కార్ల తయారీ కర్మాగారం కోసం 2006-08 మధ్య బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో సుమారు 997 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు (Singur Movement).
రైతుల భూములను తిరిగి ఇవ్వాలంటూ మమత నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో 2008 అక్టోబర్‌లో టాటా మోటార్స్ సంస్థ నానో కార్ల తయారీ పరిశ్రమను సింగూర్ నుంచి తరలించింది. ఈ ఉద్యమం ద్వారా మమతా బెనర్జీకి భారీ ప్రజాదరణ లభించింది. అనంతరం 2011లో ఆమె పార్టీ 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి అధికారంలోకి వచ్చింది. తన ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని మమత పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. విశేషమేమిటంటే.. ప్రస్తుత సీఎం సువేందు అధికారి ఆ ఉద్యమంలో మమతకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు