మస్క్ ఇక ట్రిలియనీర్ కాదు.. స్పేస్ ఎక్స్ షేర్ల భారీ పతనమే కారణం..
ABN , Publish Date - Jul 07 , 2026 | 03:04 PM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు. చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓగా సంచలనం సృష్టించిన స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పడిపోవడంతో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు. చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓగా సంచలనం సృష్టించిన స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పడిపోవడంతో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 992 నుంచి 997 బిలియన్ డాలర్ల మధ్యకు వచ్చేసింది. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మస్క్ కొనసాగుతున్నారు (Elon Musk No Longer a Trillionaire).
జూన్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీఓ భారీగా విజయవంతమైంది. ఒక్కో షేరుకు 135 డాలర్ల ప్రారంభ ధరను నిర్ణయిస్తూ, దాదాపు 75 బిలియన్ డాలర్లను సమీకరించేందుకు సంస్థ ప్రణాళిక వేసింది. తొలి రోజున స్పేస్ ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి 150 డాలర్ల వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత మరింత పైకి వెళ్లాయి. దీంతో మస్క్ ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా నిలిచారు. మస్క్ వ్యక్తిగత సంపద 1.2 ట్రిలియన్ డాలర్లను దాటి, ఆర్థిక చరిత్రను తిరగరాసింది. అయితే ఆ ఉత్సాహం ఎక్కువకాలం నిలవలేదు (SpaceX Shares Fell).
జులై ప్రారంభం నుంచి స్పేస్ ఎక్స్ షేర్లు కిందికి రావడం మొదలైంది. గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ఈ ప్రభావం నేరుగా మస్క్ వ్యక్తిగత సంపదపై పడటంతో ఆయన ట్రిలియన్ డాలర్ల మార్కును కోల్పోయారు (Elon Musk Net Worth).
ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్ షేర్లు వేగంగా పెరగడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అలాగే కంపెనీ విలువపై ఆందోళనలు పెరగడం, అధిక విలువల వద్ద కొనుగోళ్లపై జాగ్రత్తలు పెరగడం వంటి అంశాలు షేర్ల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో స్పేస్ ఎక్స్ సంస్థ మంచి లాభాలనే అందించగలదనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు