Share News

ఏఐతో జాగ్రత్త!

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:05 AM

ఏఐ (కృత్రిమమేధ) వినియోగంపై న్యాయమూర్తులు, న్యాయవాదులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏఐ పేర్కొనే ‘గత తీర్పులను’ ఉదహరించేముందు వాటిని కచ్చితంగా సరిచూసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సృష్టించే...

ఏఐతో జాగ్రత్త!

కోర్టులు, లాయర్లకు సుప్రీం హెచ్చరిక

  • కోర్టులకు, లాయర్లకు సుప్రీంకోర్టు హెచ్చరిక

  • ఏఐ పేర్కొనే ‘గత తీర్పు’లను తీర్పుల్లో, వాదనల్లో ప్రస్తావించే ముందు

ధ్రువీకరించుకోవాలని సూచన

న్యూఢిల్లీ, జూలై 2: ఏఐ (కృత్రిమమేధ) వినియోగంపై న్యాయమూర్తులు, న్యాయవాదులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏఐ పేర్కొనే ‘గత తీర్పులను’ ఉదహరించేముందు వాటిని కచ్చితంగా సరిచూసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సృష్టించే నకిలీ, ఊహాజనిత, ఉనికిలోలేని తీర్పులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని పేర్కొంది. ఈ మేరకు ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ కంపెనీ దివాలా కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధెలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏఐ సృష్టించే నకిలీ, ఊహాజనిత వివరాలను ‘కోర్టులు ఇచ్చిన గత తీర్పులు’గా పేర్కొనటం అంటే న్యాయవ్యవస్థ మీదికి మిథైల్‌ ఐసోసైనేట్‌ (భోపాల్‌ ప్రమాదంలో వెలువడిన విషవాయువు)ను వదలటమే. అది న్యాయవ్యవస్థను కలుషితం చేయటమేకాదు, దాంట్లోని జీవాన్నే హరించివేస్తుంది’ అని హెచ్చరించింది. ఏఐ సృష్టించే ‘గత తీర్పులను’ ధ్రువీకరించుకోకుండా తీర్పుల్లోగానీ, వాదనల్లోగానీ ప్రస్తావించకూడదని, అటువంటి వాటి పట్ల ఎంతమాత్రం సహించని వైఖరిని కలిగి ఉండాలని కోర్టులకు, న్యాయవాదులకు సూచించింది. ఏఐ సృష్టించే నకిలీ, ఊహాజనిత వివరాలను ఉదాహరణగా పేర్కొంటూ ఇచ్చే తీర్పులు తీర్పులే కావని ప్రకటించింది. ఏఐ సృష్టించే నకిలీ తీర్పులపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం. ఏఐ సక్రమ వినియోగంపై సానుకూలత వ్యక్తం చేసింది. కాగా, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా దివాలా కేసులో తీర్పునిస్తూ.. ఆ నిర్ణయానికి మద్దతుగా ఎన్‌సీఎల్‌టీ ఉదహరించిన పలు ‘గత తీర్పు లు’ అసలు లేనే లేవని సుప్రీంకోర్టు గుర్తించింది.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 06:05 AM