సంయమనం పాటించాలి.. శాంతపర్చాలి
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:11 AM
నిరసనల సమయంలో భద్రతా బలగాలు, పోలీసులు సంయమనం పాటించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ కొందరు దారి తప్పి రాళ్లు రువ్వినా..
రాళ్లు రువ్వినా యువతకు బలగాలు నచ్చజెప్పాలి
సర్కారు దూకుడుగా వ్యవహరిస్తే హింస చెలరేగుతుంది
ఏం చేయాలో ‘చట్ట సంస్థల’కే తెలుసు: సుప్రీం
సీజేపీ మార్చ్‌లో హింసకు ప్రేరేపించిన
నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్న
పిటిషన్ విచారణకు స్వీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 5: నిరసనల సమయంలో భద్రతా బలగాలు, పోలీసులు సంయమనం పాటించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ కొందరు దారి తప్పి రాళ్లు రువ్వినా.. యువతకు నచ్చజెప్పి శాంతింపజేయాలని సూచించింది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో హింసను ప్రేరేపించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘నిరసన జరిగి 15 రోజులు గడిచినా నిర్వాహకుల్లో కనీస జవాబుదారీతనం లేదు. ఒక్కో న్యూస్ చానెల్ వద్దకు వెళ్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే భద్రతా అధికారులు ఉదారంగా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసనలు జరుగుతాయి’ అని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘దారి తప్పి రాళ్ల దాడులకు దిగిన నిరసనకారులను శాంతపర్చడమే సరైన ప్రతిస్పందన.. వారికి సలహా, కౌన్సెలింగ్ అవసరం. సర్కారు దూకుడుగా వ్యవహరిస్తే పరిస్థితి చేజారి హింస చెలరేగే ప్రమాదముంది. వారు ఎందుకు అరుస్తున్నారో.. వారి సమస్యేంటో వినడమే అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చట్టాన్ని అమలు చేసే వాళ్లకు బాగా తెలుసు.. ఈ నిర్ణయాన్ని వారికే వదిలేద్దాం’ అని వ్యాఖ్యానించింది. నిరసనలపై దాఖలైన మరో పిటిషన్‌తో ఈ పిటిషన్‌నూ కోర్టు జత చేసింది.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం