Share News

మహిళా న్యాయవాదిపై కత్తితో దాడి చేసిన భర్త.. ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:12 PM

మహిళా న్యాయవాదిపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది.

మహిళా న్యాయవాదిపై కత్తితో దాడి చేసిన భర్త.. ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Supreme Court news

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మహిళా న్యాయవాదిపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఘటనపై సంక్షిప్త విచారణ చేపట్టింది. కేసు రిజిస్టర్ చేసి సీనియర్ అధికారిణులతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఎస్పీ లేదా డీఎస్పీ ర్యాంకు అధికారిణులతో మాత్రమే దర్యాప్తు చేయించాలని స్పష్టం చేసింది.


బాధితురాలి తరఫున అడ్వకేట్ స్నేహ కలిత బెంచ్ ముందు మాట్లాడుతూ.. ‘ఓ మహిళా న్యాయవాది అతి దారుణంగా కత్తి దాడికి గురయ్యారు. అది కూడా భర్త ఆఫీస్‌లో ఆమె కత్తి దాడికి గురయ్యారు. ఆమె చికిత్స కోసం మూడు ఆస్పత్రుల దగ్గరకు వెళితే.. చికిత్స చేయడానికి ఆస్పత్రులు ఒప్పుకోలేదు’ అని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గాయపడిన బాధితురాలిని చేర్చుకునేందుకు నిరాకరించిన మూడు ఆస్పత్రుల విషయంపై కూడా దర్యాప్తునకు ఆదేశించింది. గాయపడ్డ లాయర్‌కు ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులకు సూచించింది.


తదుపరి విచారణ సమయంలో కేసు దర్యాప్తు‌నకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని తెలిపింది. కాగా, ఢిల్లీ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ మధు రాజ్‌పుత్ ఆదివారం భర్త చేతిలో కత్తి దాడికి గురయ్యారు. ఈ విషయంపై నిన్ననే చీఫ్ జస్టిస్ సూర్య కాంత్‌కు ఓ లేఖ అందింది. ఆ లేఖ అందిన వెంటనే ఆయన సుమోటో కేసు రిజిస్ట్రర్ చేయాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

పూరన్‌ను పంపించడానికి కారణమదే: లాంగర్

విహారయాత్రకు వెళ్తున్నారా? బయలుదేరే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Updated Date - Apr 27 , 2026 | 02:02 PM