‘ట్రాన్స్‌జెండర్ చట్టం’ విచారణలపై సుప్రీం స్టే
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:35 AM
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ చట్టం-2026లోని నిబంధనలను సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది...
న్యూఢిల్లీ, జూన్ 15: ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ చట్టం-2026లోని నిబంధనలను సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను ఏకీకృతం చేసి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అంతకుముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. వేర్వేరు హైకోర్టులు ఈ అంశాన్ని విడివిడిగా విచారిస్తే భిన్నమైన లేదా పరస్పర విరుద్ధమైన తీర్పులు వచ్చే ప్రమాదముందని.. అందుకే అన్ని కేసులను సుప్రీంకోర్టుకే బదిలీ చేయాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ చట్టం-2026పై మానవ హక్కుల కార్యకర్తలు, ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక నల్సా తీర్పులో సమర్థించిన ‘లింగ స్వీయ గుర్తింపు’ అనే నిబంధనను కొత్త చట్టంలో తొలగించడమే దీనికి కారణం.. కొత్త చట్టం మేరకు లింగ గుర్తింపు కోసం వైద్య లేదా పాలన పరమైన ధ్రువీకరణ తప్పనిసరి. అయితే ఇది తమ గౌరవానికి, గోప్యతకు, శారీరక స్వేచ్ఛా హక్కులకు భంగం కలిగించడమేనని పిటిషనర్లు వాదిస్తున్నారు.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!