Share News

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:04 PM

మతం మారిన వారి ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ (SC) హోదా వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court on SC Status

న్యూఢిల్లీ: మతం మారిన వారి ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ (SC) హోదా వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడు దశాబ్ద కాలంగా పాస్టర్‌గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని పేర్కొంది.


ఫిర్యాదుదారుడికి తహశీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారి, ఆ ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని స్పష్టం చేసింది. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద రక్షణ లభించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అధికారికంగా ఒక మతంలో కొనసాగుతూ మరొక మతాన్ని ఆచరించే వారిపై చర్యలు సాధ్యం కావని.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలూ చదవండి:

ఇది కరోనా తరహా సంక్షోభం: ప్రధాని మోదీ

వృద్ధులను మోసగించి రూ.20 కోట్లు దోపిడీ

Updated Date - Mar 24 , 2026 | 01:41 PM