వృద్ధులను మోసగించి రూ.20 కోట్లు దోపిడీ
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:50 AM
డిజిటల్ అరెస్టులు అబద్ధమని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టుల పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు.
డిజిటల్ అరెస్టంటూ నెలల తరబడి బెదిరింపులు
ఒకరి నుంచి 15 కోట్లు,మరొకరి నుంచి 4.91 కోట్లు వసూలు
బెంగళూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టులు అబద్ధమని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టుల పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా కర్ణాటకలో సైబర్ నేరగాళ్లు ఇద్దరి నుంచి రూ.20 కోట్లు దోచేశారు. ఇందులో బాధితులు ఇద్దరూ సీనియర్ సిటిజన్‌లే. బెళగావికి చెందిన వ్యాపారి అజిత్ గోపాలకృష్ణ సరాఫ్(81)ను ఆరువారాల పాటు బెదిరించి రూ.15.45 కోట్లు కాజేశారు. బెంగళూరుకు చెందిన సీనియర్ పరిశోధకుడు(94) కూడా సైబర్ ఉచ్చులో పడ్డారు. ఆయన బ్యాంకు ఖాతాల నుంచి రూ.4.91 కోట్లు కాజేశారు. గత ఫిబ్రవరి 5న అజిత్ గోపాలకృష్ణకు సీబీఐ అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్నారని భయపెట్టారు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి, సీబీఐ, ఆర్‌బీఐ విజిలెన్స్ సెల్‌లో కేసు నమోదైందని కొన్ని కాగితాలను చూపించారు. శివసుబ్రమణ్యంగా చెప్పుకొన్న వ్యక్తి అజిత్‌ను పలురకాలుగా బెదిరించాడు. జెట్ ఎయిర్‌వేస్‌లో నరేశ్ గోయెల్ అనే వ్యక్తితో ఆర్థిక వ్యవహారాలు జరిపారని, నగదు అక్రమ బదిలీలో భాగస్వాములైనట్లు ఆధారాలు ఉన్నాయని బెదిరించాడు. ఆ తర్వాత ఆర్‌బీఐ విజిలెన్స్ అధికారిగా చెప్పుకున్న జార్జ్‌మాథ్యూ, మరో వ్యక్తి లైన్‌లోకి వచ్చి, డిపాజిట్‌లు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని అజిత్‌ను కోరారు. ఆ వివరాలు ఇచ్చాక, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులను విత్‌డ్రా చేయాలని ఒత్తిడి చేశారు. ఇదంతా సీబీఐ అధికారులే చేస్తున్నారని భ్రమపడిన అజిత్, కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లే చేశారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట అజిత్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకున్నారు. ‘దర్యాప్తు పూర్తయ్యేదాకా నగదు మీ ఖాతాలలో ఉండరాదు’ అని నమ్మించి విడతల వారీగా తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడిన అజిత్ గోపాలకృష్ణ తన గది నుంచి కొన్ని రోజులపాటు బయటకు రాలేదు. ఉగాది సెలవులకు తనను కలిసేందుకు వచ్చిన కుమారుడికి అజిత్ ఈ విషయం చెప్పారు. దీంతో బాధితుడి కుమారుడు బెళగావి పోలీసులకు ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బెళగావి కమిషనర్ భూషణ్‌రావ్ గులాబ్‌రావ్ సోమవారం మీడియాకు తెలిపారు. సైబర్ నేరగాళ్లు రూ.15.45 కోట్లు కాజేశారని, వారి ఖాతాల్లో ఉన్న రూ.90 లక్షలను ఫ్రీజ్ చేశామని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ కేసు సీఐడీకి అప్పగిస్తామని అన్నారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ పేరిట బెదిరించి
బెంగళూరు నగరానికి చెందిన సీనియర్ పరిశోధకుడి వయసు 94 ఏళ్లు. విక్టోరియా రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నారు. గత ఏడాది డిసెంబరు 2న వారి ఇంటి ల్యాండ్‌ఫోన్‌కు ఒకరు కాల్ చేశారు. ‘మీపై బళ్ళారి పోలీస్‌స్టేషన్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. మీతో ఇన్‌స్పెక్టర్ మాట్లాడతారు’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత సందీప్ రావు పేరిట మరో వ్యక్తి ఫోన్ చేసి, తాను సీబీఐ అధికారినని పరిచయం చేసుకున్నాడు. ఆధార్‌కార్డును వాట్స్‌పలో పంపాలని సూచించాడు. ఆధార్ పంపిన తరువాత వాట్సప్ ద్వారా నకిలీ ఎఫ్‌ఐఆర్ కాపీని పంపించి, పలు ఫోన్ల ద్వారా వీడియో కాల్స్ చేశారు. గత ఏడాది డిసెంబరు 17 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 23 వరకు డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి, విడతలవారీగా రూ.4.91కోట్ల నగదును బదిలీ చేయించుకున్నారు.