పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డపై తల్లికే హక్కు
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:14 AM
ఇద్దరు వివాహం చేసుకోకుండానే వారికి బిడ్డ జన్మిస్తే, ఆ సంతానం సంరక్షణ విషయంలో తల్లికే ప్రాథమికంగా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు వివాహం చేసుకోకుండానే వారికి బిడ్డ జన్మిస్తే, ఆ సంతానం సంరక్షణ విషయంలో తల్లికే ప్రాథమికంగా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న జర్మన్ మహిళకు ఆమె నాలుగేళ్ల కుమారుడిని తాత్కాలిక కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఓ భారతీయ న్యాయవాది, జర్మనీకి చెందిన మహిళకు వివాహం కాకుండా కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ తల్లి, విద్యాభ్యాసం కోసం తన కుమారుడిని సింగపూర్ తీసుకెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే, బిడ్డను భారత్‌లోనే తన వద్ద ఉంచాలని తండ్రి కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ చట్టం-1956లోని సెక్షన్ 6(బి) తదితర చట్టాల ప్రకారం.. వివాహేతర బంధం ద్వారా జన్మించిన పిల్లల సహజ సంరక్షణ విషయంలో తల్లికే తొలి ప్రాధాన్యం ఉంటుందని గుర్తుచేసింది. తల్లికి తాత్కాలిక కస్టడీని ఇస్తూనే, తండ్రి హక్కులకు భంగం కలగకుండా సుప్రీంకోర్టు పలు షరతులు విధించింది. ఏడు రోజులకు మించి పాఠశాల సెలవులు వచ్చిన ప్రతిసారీ బిడ్డను భారత్‌కు తీసుకురావాలని, ఆ సమయంలో నిర్ణీత రోజుల పాటు తండ్రి, ఆయన కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనుమతించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు