బుల్డోజర్ల ప్రయోగం చట్టబద్ధమే
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:55 AM
రాజ్యాంగ నిబంధనలు, చట్ట పరిధిని ఉల్లంఘించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను ప్రయోగించేందుకు అడ్డేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ కూల్చివేతలు...
అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పలు రాష్ట్రాల్లో కూల్చివేతలకు సంబంధించి
కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణకు నిరాకరణ
న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిబంధనలు, చట్ట పరిధిని ఉల్లంఘించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను ప్రయోగించేందుకు అడ్డేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ కూల్చివేతలు చట్టబద్ధంగా, నోటీసులు జారీ చేసి, తగిన గడువు ఇచ్చి చేపట్టాలని పేర్కొంది. బుల్డోజర్లతో కూల్చివేతలపై 2024 నవంబరులో సుప్రీం ఇచ్చిన తీర్పు వివిధ కేసుల్లో నిందితుల ఇళ్ల కూల్చివేతలకు సంబంధించినది మాత్రమేనని తేల్చిచెప్పింది. చట్టాన్ని అమలు చేస్తున్నామనే నెపంతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోకూడదన్నదే ఆ తీర్పులోని మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది. ఈ మేరకు గుజరాత్‌లోని సోమనాథ్‌లో మసీదుల కూల్చివేత, మహారాష్ట్ర, పలు ఇతర రాష్ట్రాల్లో నిర్మాణాల కూల్చివేత విషయంలో అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్లన్నింటినీ ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేసింది. స్థానిక పరిస్థితులు, కేసులో మెరిట్‌ను బట్టి.. వీలైనంత వరకు నాలుగు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టులకు సూచించింది. అయితే హైకోర్టుల్లో సదరు కేసుల విచారణ పూర్తయ్యే వరకు తాము ఇప్పటికే స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక