Share News

అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:25 AM

ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడానికి ఉన్న 24 గంటల గడువు అనేది.. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే మొదలవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు
SUPREMECOURT

  • అరెస్టు చూపడంలో జాప్యంచేసినా లెక్క మారదు

  • ప్రయాణ సమయానికి మాత్రమే మినహాయింపు

  • రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగొద్దు

  • సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, నవంబరు 5: ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడానికి ఉన్న 24 గంటల గడువు అనేది.. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే మొదలవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిందితుడిని అరెస్టు చేశామని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి 24 గంటల గడువు మొదలుకాదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(2) ప్రకారం అరెస్టుకు, అదుపులోకి తీసుకోవడానికి మధ్య ఎలాంటి కృత్రిమ వ్యత్యాసం లేదని వెల్లడించింది. అరెస్టుకు ముందు కాలాన్ని మినహాయించేందుకు పోలీసులు చేసే ఏ ప్రయత్నమైనా అది రాజ్యాంగానికి వ్యతిరేకమేనని పేర్కొంది. ఒకవేళ నిర్బంధం 24 గంటలకు మించి కొనసాగితే సదరు వ్యక్తిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుచకముందే కస్టడీ నుంచి విడుదల చేయాలని తెలిపింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చందూర్‌కర్‌ల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. ‘అధికారికంగా అరెస్టు చేసినప్పటి నుంచే 24 గంటల గడువు మొదలవుతుందనే అభిప్రాయం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(2), భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 56కు వ్యతిరేకం’ అని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు జరిగిన ప్రదేశం నుంచి మేజిస్ట్రేట్‌ కోర్టుకు చేరుకునే ప్రయాణ సమయాన్ని మాత్రమే 24 గంటల గడువు నుంచి మినహాయించవచ్చునని తీర్పులో పేర్కొంది.


అంతేకానీ, అధికారికంగా అరెస్టును ప్రకటించడానికి ముందు విచారణ, దర్యాప్తు, సోదాలు లేదా సీజ్‌ కోసం తీసుకున్న సమయాన్ని 24 గంటల గడువు నుంచి మినహాయించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు 24 గంటల గడువు లెక్కింపునకు సంబంధించి ఆర్యమన్‌ పట్నాయక్‌ కేసులో ఒడిసా హైకోర్టు, కన్నన్‌ కేసు లో మద్రాసు హైకోర్టు, అరుణ్‌ కే థామస్‌ కేసులో కేరళ హైకోర్టుల ఉత్తర్వులను వ్యతిరేకించింది. ఒకవేళ అటువంటి నిర్బంధం 24 గంటలకు మించి కొనసాగితే సదరు వ్యక్తిని కస్టడీ నుంచి విడుదల చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఓ కేసులో నలుగురు నిందితులకు త్రిపుర హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీనిపై ఆ నలుగురు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

Updated Date - Nov 06 , 2026 | 04:27 AM