గనుల రాయల్టీకి టెండర్‌తో సంబంధం లేదు
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:45 AM
గనుల రాయల్టీ(ప్రభుత్వ పన్ను) చెల్లింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. టెండర్ ముగిసి, రాయల్టీ రేటు ఖరారైనంత మాత్రాన పాత పన్నులే వర్తిస్తాయనడం...
ఖనిజం తరలించే సమయానికి ఉన్న రేటే చెల్లించాలి: సుప్రీం
న్యూఢిల్లీ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): గనుల రాయల్టీ(ప్రభుత్వ పన్ను) చెల్లింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. టెండర్ ముగిసి, రాయల్టీ రేటు ఖరారైనంత మాత్రాన పాత పన్నులే వర్తిస్తాయనడం చట్టవిరుద్ధమని పేర్కొంది. గని నుంచి ఖనిజం రవాణా అయ్యే నాటికే ప్రాధాన్యం ఉంటుందని, ఆ సమయానికి చట్ట ప్రకారం అమలులో ఉన్న రేట్లనే చెల్లించాలని తేల్చిచెప్పింది. ఒప్పందాల సాకుతో పన్నుల నుంచి తప్పించుకోవాలని చూేస్త కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి, చిత్రదుర్గ, తుమకూరు ప్రాంతాల్లో కొన్ని వివాదాలతో మైనింగ్ నిలిచిపోయింది. కోర్టు పర్యవేక్షణలో 2014 జూన్‌లో ఇనుప ఖనిజాన్ని వేలం వేశారు. బి.ఎమ్.ఎమ్ ఇస్పాత్ అనే కంపెనీ ఆ వేలంలో ఖనిజాన్ని దక్కించుకుంది. అప్పుడున్న 10 శాతం రేటు ప్రకారం రాయల్టీ కట్టేసింది. అయితే, ఆ ఖనిజం మొత్తాన్ని కంపెనీ తన దగ్గరకు తరలించుకోక ముందే.. కేంద్రం 2014 సెప్టెంబరు నుంచి ఆ రాయల్టీని 15 శాతానికి పెంచుతూ చట్టం మార్చింది. సదరు కంపెనీ మాత్రం పాత రాయల్టీనే చెల్లిస్తూ ఖనిజాన్ని తరలించింది. దీనిపై అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖనిజం రవాణా జరిగిన సమయానికి పెరిగిన రేటు వర్తిస్తుందని, కాబట్టి మిగిలిన 5 శాతం అదనపు రాయల్టీని వసూలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో గనులశాఖ సదరు సంస్థ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి సుమారు రూ.2కోట్లకు పైగా మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ప్రైవేట్ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ‘ఒప్పందం నాటి రేటు మాత్రమే వర్తిస్తుంది’ అంటూ ప్రభుత్వ చర్యను హైకోర్టు తప్పుబట్టింది. ఆ తీర్పును సవాలు చేస్తూ గనులశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ఒక చట్టం మారినప్పుడు పాత ఒప్పందాలు ఆటోమేటిక్‌గా కొత్త చట్టానికి లోబడి మారాలని, లేదంటే తలొగ్గి ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ప్రభుత్వం చట్టాన్ని సవరించినప్పుడు.. గతంలోని ముందస్తు ఒప్పందాలు ఆ చట్టానికి లోబడి ఉండాల్సిందే. చట్ట సవరణ ద్వారా రాయల్టీ రేట్లు పెరిగినప్పుడు, పాత ఒప్పంద నిబంధనలను సాకుగా చూపిస్తూ ఆ పెంపును అడ్డుకోవడానికి, పరిమితం చేయడానికి వీల్లేదు. గతంలో కోర్టులు రాయల్టీ రేటును 10 శాతంగా పేర్కొంటూ ‘వర్తిస్తుంది’ అనే పదాన్ని వాడాయి. దీని అర్థం ఖనిజాన్ని రవాణా చేేస ‘ఆయా సమయాల్లో’ ఏ రేటు అమలులో ఉంటే అది వర్తిస్తుందని మాత్రమే. అంతేగానీ, రాయల్టీ రేటును ఎప్పటికీ 10 శాతం దగ్గరే స్తంభింపజేయడం కోర్టు ఉద్దేశం కాదు. వేలంలో దక్కించుకున్న ఇనుప ఖనిజాన్ని చట్ట సవరణ అమలులోకి రాకముందే, ఒకే విడతలో లేదా త్వరితగతిన పూర్తిగా తరలించుకునే అవకాశం సదరు కంపెనీ (రెస్పాండెంట్)కి ఉంది. కానీ వారు ఆలస్యంగా ఖనిజాన్ని తరలించారు. అలాంటప్పుడు పెరిగిన రాయల్టీ భారం నుంచి మినహాయింపు కోరలేరు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెరిగిన పన్నును ప్రభుత్వం డిపాజిట్ నుంచి కట్ చేసుకోవడం సరైనదేనంటూ, హైకోర్టు తీర్పును రద్దు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్