ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షకు సుప్రీం నో
ABN , Publish Date - Aug 19 , 2026 | 06:35 AM
ఉరి తీయడానికి పట్టే దాని కంటే తక్కువ సమయంలో, స్వల్ప నొప్పితో ప్రాణం తీసే ప్రాణాంతక ఇంజెక్షన్‌ను మరణశిక్ష కోసం వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను...
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఉరి తీయడానికి పట్టే దాని కంటే తక్కువ సమయంలో, స్వల్ప నొప్పితో ప్రాణం తీసే ప్రాణాంతక ఇంజెక్షన్‌ను మరణశిక్ష కోసం వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మరణశిక్ష విధానమే కొనసాగుతుందని, అవసరమైతే దానిపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేపడుతుందని స్పష్టం చేసింది. ఉరి ద్వారా మరణశిక్ష విధించడానికి ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, ఆ ప్రశ్నను భవిష్యత్తు న్యాయ సమీక్షకు వదిలిపెడుతున్నట్టు తెలిపింది. 1983 నాటి త్రిసభ్య బెంచ్ ఉరి ద్వారా మరణశిక్షకు రాజ్యాంగబద్ధత ఉన్నదని తీర్పు ఇచ్చింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న పిటిషనర్ వాదనను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ తిరస్కరించింది. విచారణ సందర్భంగా పిటిషనర్, న్యాయవాది రిషీ మల్హోత్రా వాదనలు వినిపించారు. ‘‘ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధించడం బాధాకరం. ఉరికి 40నిమిషాలు పడుతుంది. ప్రాణాంతక ఇంజెన్షన్‌ను వాడి 5నిమిషాల్లో మరణశిక్షను అమలు చేయొచ్చు’’ అని వాదించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘మా తీర్పే అంతిమం కాదు. ప్రత్యామ్నాయ పద్ధతుల విషయంలో శాస్త్రీయ ఆధారాలు ఉంటే.. భవిష్యత్తులో ఈ అంశాన్ని పరిశీలించవచ్చు. దీనికోసం న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులతో కమిటీని ప్రభుత్వం వేయొచ్చు’’ అని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం