విమానంలో ప్రయాణించకండి!
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:46 AM
విమాన టికెట్ ధరలు దాదాపు 700 శాతం పెరిగాయని, వాటిని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
టికెట్ ధరల పెంపును సవాలు చేస్తూదాఖలైన పిటిషన్ విచారణలో సుప్రీం వ్యాఖ్యలు
చార్జీలు 700శాతంపెంచారు.. అత్యవసరంగా విచారించాలి: పిటిషనర్ తరఫు న్యాయవాది
అయితే.. ‘విమానంలో వెళ్లకండి’ అన్న ధర్మాసనం
ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే మరో కేసు విచారణ
న్యూఢిల్లీ, నవంబరు 2: విమాన టికెట్ ధరలు దాదాపు 700 శాతం పెరిగాయని, వాటిని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విమాన టికెట్ ధరలు భారీగా పెరగడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విమాన టికెట్ ధరలు 700 శాతం పెరిగాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా.. ‘అయితే విమానంలో వెళ్లకండి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విమాన ప్రయాణాన్ని అత్యవసర సేవగా పరిగణించాలని, ఈ ధరల పెరుగుదల రాజ్యాంగంలోని 14వ అధికరణ ఉల్లంఘన కిందకు వస్తుందని న్యాయవాది పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘అయితే విమానంలో వెళ్లకండి’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే.. మరో కేసును విచారణకు తీసుకుంది. ఇదిలా ఉండగా పౌర విమానయాన రంగంలో పారదర్శకత, ప్రయాణికుల రక్షణ నిమిత్తం బలమైన స్వతంత్ర నియంత్రణ సంస్థ ఉండాలంటూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు విచారిస్తోంది.
భారత్‌లోని ప్రైవేటు విమానయాన సంస్థలు టికెట్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నాయని, ఇష్టారీతిన అనుబంధ చార్జీలను విధిస్తున్నాయని.. వాటిపై నియంత్రణ అవసరమని నారాయణన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది విచారణ దశలో ఉండగానే.. 700 శాతం ధరల పెంపుపై పిటిషన్ దాఖలైంది. మరోవైపు ‘భారతీయ వాయుయాన్ అధినియమ్’ చట్టం కింద కొత్త నిబంధనలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. విమాన టికెట్ ధరలపై గరిష్ఠ పరిమితి విధించనప్పటికీ అసాధారణ పరిస్థితుల్లో అవసరమైతే జోక్యం చేసుకునే అధికారం ఈ చట్టంతో కేంద్రానికి లభించింది. కాగా, ఈ నెల 16న నిర్వహించనున్న తదుపరి విచారణ నాటికల్లా వాయుయాన్ అధినియమ్ నిబంధనలను ప్రచురించాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి